● వీసీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రేపటి నుంచి 26వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించే సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో సంక్షేమ వారం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల పాటు ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ గురుకులం, విద్యాలయాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులకు క్విజ్, విద్యా విశ్లేషణ, చిత్రలేఖనం, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలన్నారు. వసతి గృహాలలో మరమ్మతు పనులను చేపట్టాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి సమావేశం నిర్వహించి వసతులపై చర్చించాలని సూచించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని, వేసవి శిబిరం, బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. రైతు రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారం నిర్వహించే సంక్షేమ వారాన్ని పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. శానిటేషన్ సమస్యలను పరిష్కరి స్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 62 శాతం రైతుల రిజిస్ట్రీ పురోగతి సాధించామని, మిగిలిన లక్ష్యాన్ని త్వరగా పూర్తిచేస్తామన్నారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం పోలీస్, రవాణా శాఖల సమన్వయంతో కార్యక్రమాలు పూర్తి చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


