● కలెక్టర్ టీఎస్.దివాకర
ములుగు: రక్తదానం చేయడం ద్వారా నిండు ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదాతల సేవా స్ఫూర్తి ప్రశంసనీయమని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, టీజీఓ అసోసియేషన్, టీఎన్జీవో యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనమిచ్చే ప్రతీ రక్తపు బొట్టు ఒక నిండు ప్రాణాన్ని నిలబెడుతుందన్నారు. రక్తదానం అనేది కేవలం ఒక కార్యక్రమంగా చూడకూడదని తెలిపారు. జీవితాలను కాపాడే మహత్తర సేవలో భాగంగా ప్రతీ ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తం అందుబాటులో ఉండడం అత్యవసర చికిత్సల్లో ఎంతో కీలకమన్నారు. ముఖ్యంగా ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్యసేవల సమయంలో రక్తదానం ప్రాణదాతగా నిలుస్తుందని వెల్లడించారు. జిల్లాలోని ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువత, పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి కలెక్టర్ ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్‌రావులు సైతం రక్తదానం చేసి ఉద్యోగులకు, దాతలకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ చంద్రశేఖర్, అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


