ములుగు: జిల్లా కేంద్రంలో నేడు (శనివారం) నిర్వహించనున్న విరాట్ హిందూ మహాసమ్మేళనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్ తెలిపారు. శుక్రవారం ఉత్సవ కమిటీ సభ్యులు మహాసమ్మేళనం నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా సమ్మేళన కార్యక్రమం శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. శ్రీ భువనేశ్వరి దేవి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామిజీ, ధర్మ జాగరణ అఖిల భారత సహ సంయోజక్ ఏలె శ్యాంకుమార్ జీ హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రతీఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని కమిటీ సభ్యులు అందజేసిన నవధాన్యాలను తీసుకువచ్చి యాగంలో సమర్పించి భారతమాతతో పాటు హిందూ దేవతామూర్తుల ఆశీర్వాదం పొందాలన్నారు. సమ్మేళనానికి హాజరయ్యే ప్రజలు తమ గ్రామాల్లో ఏర్పాటు చేసిన స్కూల్ బస్సుల ద్వారా రావాలని కోరారు. సుమారు పది వేల మందికి సరిపడే విధంగా అన్ని వసతులు కల్పించామని, సభ విజయవంతం కోసం కమిటీ సభ్యులు సమష్టిగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు కర్ర రాజేందర్‌రెడ్డి, రాజ్‌కుమార్, చింతలపూడి భాస్కర్‌రెడ్డి, వాసుదేవారెడ్డి, బాణాల సుధాకర్, ఇమ్మడి రాకేష్, ప్రకాష్, బాబురావు, కుమార్, జీవన్‌రెడ్డి, రమేష్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.


