ఆరోగ్యానికి పోషణ | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి పోషణ

Apr 17 2026 10:26 AM | Updated on Apr 17 2026 10:26 AM

ఆరోగ్యానికి పోషణ కార్యక్రమాల వివరాలు

పోషణ పక్షోత్సవాల విజయవంతానికి కృషి..

ఈ నెల 23 వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పక్షోత్సవాలు

ములుగు రూరల్‌: తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వాలు పోషణ పక్షోత్సవాలు(పోషణ పక్వాడ) నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణ రూపొందించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ప్రధాన లక్ష్యంతో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ అభియాన్‌, పోషణ ట్రాకర్‌, ఆరోగ్యలక్ష్మి వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న నేపథ్యంలో అంగన్‌వాడీలు తల్లీబిడ్డ ఆరోగ్యం, వారికి పౌష్టికాహారం అందిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నారు. వివరాలను అంగన్‌వాడీ టీచర్లు యాప్‌లో నమోదు చేస్తున్నారు.

పిల్లల పోషణపై చర్చ సాగేలా టాక్‌ షోలు, సభలు నిర్వహిస్తారు. తల్లిపాలపై అవగాహన కల్పిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలలో అమ్మమ్మ, నాన్నమ్మలతో పోషణ కథలు చెప్పిస్తారు. గర్భిణులు పిల్లల కోసం ప్రత్యేక పోషణ, ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తారు. చిరు ధాన్యాలతో ఆహార పదార్థాల తయారు చేసి ప్రదర్శించడం, పోషణ మేళ, క్విజ్‌ పోటీలు, పూర్వ ప్రాథమిక విద్యపై ప్రచారం నిర్వహిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలలో ఫ్రీ స్కూల్‌, సంసిద్ధత కార్యకలాపాలు, నో సీక్రన్‌ అవర్‌, ఫ్యామిలీ ప్లే టైం, బహిరంగ ఆటలు, శారీరక కార్యక్రమాలు చేపడుతారు. ఈ క్రీడలను 15 రోజుల పాటు నిర్వహించి సంబంధించిన ఫొటోలు, వీడియోలను యాప్‌లో నమోదు చేస్తారు.

4 ప్రాజెక్టులు.. 640 అంగన్‌వాడీ కేంద్రాలు

జిల్లాలోని పది మండలాల పరిధిలో ములుగు, ఎస్‌ఎస్‌ తాడ్వాయి, ఏటూరునాగారం, వెంకటాపురం(కె) పరిధిలో 640 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 0 నుంచి 3 సంవత్సరాలు కలిగిన చిన్నారులు 10,107, మూడు నుంచి ఆరేళ్ల వయస్సు కలిగిన చిన్నారులు 9,377, గర్భిణులు 2,443, బాలింతలు 1,075 మంది ఉన్నారు.

పౌష్టికాహారం, ప్రాథమిక విద్యపై

అవగాహన

వేసవి దృష్ట్యా జాగ్రత్తలతో నిర్వహణ

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పోషణ పక్షోత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తాం. 15 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో అందరినీ భాగస్వాములను చేస్తాం. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. పౌష్టికాహారం అందించడం, ఆరోగ్యం, వ్యాయామం, పరిశుభ్రత వంటి విషయాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తాం.

– ప్రేమలత, జిల్లా సంక్షేమాధికారి

Advertisement
 
Advertisement
Advertisement