ములుగు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, మహోన్నత వ్యక్తుల ఆశయాలను అమలు చేయడమే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి అని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బస్టాండ్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అదే విధంగా కలెక్టరేట్‌లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వనల ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ అంబేడ్కర్ దేశానికి అందించిన సేవలు, రాజ్యాంగ నిర్మాణానికి చేసిన కృషి మరువలేనిదని తెలిపారు. ఆయన ఘన కీర్తి ప్రపంచ నలుమూలలు వ్యాప్తి చెందడంతో పాటు ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్‌పర్సన్ ఆసియా షాహినా, అదనపు కలెక్టర్ సంపత్‌రావు, ఆర్డీఓ వెంకటేశ్, డీఎస్పీ కిశోర్, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అగ్ని ప్రమాదాల నివారణకు
జాగ్రత్తలు తప్పనిసరి
అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తప్పనిసరి తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ దివాకర పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అగ్ని ప్రమాదాల నివారణ, అవగాహన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. 1944 ఏప్రిల్ 14వ తేదీన ముంబాయి డాక్ యార్డులో ఒక నౌకకు అగ్ని ప్రమాదం సంభవించి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 66 మంది అగ్నిమాపక దళ సిబ్బందిని స్మరించుకుంటూ ప్రతీ ఏడాది ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హోటళ్లలో అగ్నిప్రమాద పరికరాలు అన్ని వేళలా పని చేసేలా ఉంచాలని, ప్రతి అంతస్తులో మెట్ల ద్వారాలు, అగ్నిమాపక పరికరాల స్థానం తెలిపే ఎస్కేప్ ప్లాన్ ఉంచాలని సూచించారు. ఎయిర్ కండిషనర్ ద్వారా మంటలు వ్యాప్తి చెందకుండా డ్యాంపర్స్ ఏర్పాటు చేయాలని వాటిని ఆటోమేటిక్ డిటెక్టివ్ సిస్టంకు అనుసంధానం చేయాలని వెల్లడించారు. విద్యుత్ వైరింగ్, స్విచ్‌లు, ఇతర పరికరాలు క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలని ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోవాలన్నారు. వంట గదిలో అగ్నిప్రమాదం జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పోస్టర్ ఆవిష్కరణలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్‌పర్సన్ అసియా షాహినా, ఆర్డీఓ వెంకటేశ్, డీఎస్పీ కిశోర్, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి నాగరాజు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో ఆరైవ్ అలైవ్ వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ దివాకర వాహనదారులతో రహదారి భద్రత ప్రతిజ్ఞ చేపించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం, ఇతరులకు తెలియజేయడం, ప్రమాదాలను నివారించడం వంటి అంశాలపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర


