నేడు భారీ ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

నేడు భారీ ర్యాలీ

Apr 16 2026 1:05 PM | Updated on Apr 16 2026 1:05 PM

నేడు భారీ ర్యాలీ ‘అక్రమ పట్టాదార్‌ పాస్‌పుస్తకం రద్దు చేయాలి’

ములుగు: జిల్లా కేంద్రంలో ఈనెల 18న నిర్వహించనున్న హిందూ సమ్మేళనాన్ని పురస్కరించుకొని బుధవారం సాయంత్రం 4 గంటలకు హనుమాన్‌ జెండాలతో సుమారు 500 ద్విచక్ర వాహనాలతో జిల్లా కేంద్రంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ కన్వీనర్‌ గండ్రకోట కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ములుగులోని డీఎల్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ వద్ద బైక్‌ ర్యాలీ ప్రారంభమై మెయిన్‌రోడ్‌ మీదుగా జిల్లా కేంద్రంలోని అన్ని పుర వీధులలో కొనసాగుతుందని వెల్లడించారు. ప్రతీ ఒక్క హిందూ సోదరుడు కార్యక్రమంలో విధిగా పాల్గొని హిందూ సమ్మేళానికి మద్దతు తెలిపి బైక్‌ ర్యాలీని విజయవంతం చేయాలని కుమార్‌ పిలుపునిచ్చారు.

ట్యాంకర్‌తో

తాగునీటి సరఫరా

ఏటూరునాగారం: మండల పరిధిలోని గంటలకుంటలో గొత్తికోయ గిరిజనులకు తాగునీటి సమస్య ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క ఆ గూడేనికి మంగళవారం వాటర్‌ ట్యాంక్‌ను పంపించి నీటిని అందించారు. దీంతో గొత్తికోయలు ఆనందం వ్యక్తం చేశారు. వేసవి కాలం ముగిసే వరకు నీటి ఎద్దటి లేకుండా చూస్తామని స్థానిక నాయకుడు గుడ్ల దేవేందర్‌ తెలిపారు. గూడెంలో బోరు నిర్మాణానికి అటవీశాఖ అడ్డంకులు చెప్పడంతో తాగునీటిని ట్యాంకర్ల ద్వారా అందజేయాల్సి వస్తుందని దేవేందర్‌ తెలిపారు.

మంగపేట: మండల పరిధిలోని కమలాపురానికి చెందిన మేడిపెల్లి వెంకటేశ్వర్లు తనకు భూమి లేకున్నా 18 ఎకరాలు ఉన్నట్లుగా అక్రమంగా పొందిన పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను వెంటనే రద్దు చేయాలని సిద్ధాబత్తుల జగదీశ్వర్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జగదీశ్వర్‌రావు మాట్లాడారు. వెంకటేశ్వర్లు రెవెన్యూ అధికారుల సహకారంతో మండలంలోని చెరుపల్లి, కమలాపురంలో 151/1, 208/6, 208/6ఏ సర్వే నంబర్లలో 18 ఎకరాల పట్టా భూమి ఉన్నట్లుగా పట్టాదార్‌ పాసుపుస్తకాలు పొందాడని తెలిపారు. వాటిపై బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నాడని, ప్రభుత్వం నుంచి రైతుబంధు సైతం తీసుకుంటున్నట్లుగా తహసీల్దార్‌కు గతేడాదిలో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ విషయంపై గిర్ధావర్‌, సర్వేయర్‌ సర్వే చేయగా భూమిలేదని సరైన ఆధారాలు లేవని 2026 ఫ్రిబ్రవరి 28న తనకు లెటర్‌ ద్వారా తెలిపారని వివరించారు. అదే విషయాన్ని కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. దీంతో వెంకటేశ్వర్లు తనపై కోపంతో అతని స్నేహితుడితో కలిసి తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు పోలీసులు తనకు రక్షణ కల్పించడంతో పాటు అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కాలసర్ప నివారణ పూజలకు భక్తుల రద్దీ

కాళేశ్వరం: మంగళవారం సెలవుదినం కావడంతో కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలకు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో వద్ద కాలసర్ప నివారణ పూజలు భక్తులు అధిక సంఖ్యలో నిర్వహించారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామికి అభిషేక పూజలు చేశారు. సుమారుగా 200లకుపైగా భక్తులు పూజలు చేశారు. శ్రీశుభానందేవిచ, శ్రీసరస్వతీ అమ్మవార్లను దర్శించుకున్నారు. మంచి ముహూర్తాలు ఉండడంతో భక్తులు తమ పెళ్లిళ్లు, దోషాల పాపహరణం కోసం ముందస్తుగా కాలసర్ప నివారణ పూజలు చేసుకుంటున్నారు. దీంతో కాళేశ్వరాలయం పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement