20న కాళేశ్వరానికి సీఎం | - | Sakshi
Sakshi News home page

20న కాళేశ్వరానికి సీఎం

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

20న కాళేశ్వరానికి సీఎం

మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

కాళేశ్వరం: ఈనెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఈనేపథ్యంలో జయశంకర్‌ భూపాలపల్లి కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ భద్రత, ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. 20న సీఎంతో పాటు మంత్రులు రానున్న సందర్భంగా కట్టుదిట్టమైన భధ్రత ఏర్పాటు చేయనున్నారు. సుమారు 40 ఎకరాల్లో సభాస్థలి, ఇతర ఏర్పాట్లు చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలక మేడిగడ్డ బ్యారేజీలో 2023 అక్టోబర్‌ 21న 7వ బ్లాక్‌లోని 20వ పియర్‌(పిల్లర్‌) కుంగిపోగా, వంతెన కుంగి పగుళ్లు తేలిన విషయం తెలిసిందే. అదే సమయంలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీ లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం (ఎన్‌డీఎస్‌ఏ) నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం లేదు. వాటికి మరమ్మతులు చేసి పునరురిస్తామని ఇటీవల సీఎం ఇచ్చిన హామీ మేరకు పర్యటన ఖరారైందని రైతాంగం ఆశిస్తోంది. ఇప్పటికే పుణేకు చెందిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ బృందం సైంటిస్టులు బ్యారేజీలో పలమార్లు జియోఫిజికల్‌, జియోటెక్నికల్‌తో పాటు పలు రకాల పరీక్షలు చేపట్టారు. ఆ పరీక్షలను సీఎం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్నారు. ఇరిగేషన్‌శాఖ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టింది.

నస్తూర్‌పల్లిలో సభ

సీఎంతో పాటు ఇతర మంత్రుల మేడిగడ్డ పర్యటన తర్వాత బహిరంగ సభలో పాల్గొని మాట్లాడనున్నారు. ఈ సభా వేదిక నిర్వహణను 40 ఎకరాల్లో కాటారం మండలం నస్తూర్‌పల్లిలో సభా వేదిక, వాహనాల పార్కింగ్‌ సదుపాయాలు, హెలిపాడ్‌, భద్రతా ఏర్పాట్లు, ప్రజలకు మౌలిక సదుపాయాలను అధికారులతో కలిసి కలెక్టర్‌, ఎస్పీ, ఇతర శాఖల అధికారులు పరిశీలించారు. కాగా, కాళేశ్వరం, కుదురుపల్లిలో సభాస్థలి కోసం పరిశీలనలు చేసినప్పటికీ అనువుగా ఉండే నస్తూర్‌పల్లిలో ఏర్పాట్లకు అధికారులు సుముఖం తెలిపారు. దీంతో పకడ్బందీ ఏర్పాట్లు జరుగనున్నాయి.

పకడ్బందీ ఏర్పాట్లు చేయండి..

ఈ నెల 20న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను పురస్కరించుకొని ఽకాటారం మండలం ధన్వాడలోని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తన నివాసంలో భూపాలపల్లి కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఇందులో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మేడిగడ్డకు చేరుకుని ప్రాజెక్టును పరిశీలిస్తారని, అనంతరం సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి, తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రత, రవాణా, హెలిపాడ్‌, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ట్రేడ్‌ ప్రమోషన్‌ చైర్మన్‌ ఐత ప్రకాశ్‌రెడ్డి, ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యులు దండు రమేశ్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజబాబు పాల్గొన్నారు.

కాటారం మండలం నస్తూర్‌పల్లిలో సభాస్థలి, పార్కింగ్‌ స్థలాలు

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీలు

ధన్వాడలో అధికారులతో

మంత్రి శ్రీధర్‌బాబు సమీక్ష

Advertisement
 
Advertisement
Advertisement