వెంకటాపురం(కె): ఎండలు మండుతుండటంతో తాగునీటి కోసం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వానరాలకు సైతం వేసవిలో తాగునీటి తిప్పలు తప్పడం లేదు. కోతులు దాహం తీర్చుకునేందుకు నీటి వనరులు లేకపోవడంతో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద చిన్న గుంటలో నిలిచిన నీటిని తాగి దాహాన్ని తీర్చుకుంటున్నాయి.
హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై
అపోహలు వద్దు
ములుగు రూరల్: గర్భదార ముఖద్వార క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్(హెచ్‌పీవీ)పై ఎలాంటి అపోహలు వద్దని జిల్లా వ్యాధి నిరోధక టీకాల నియంత్రణ అధికారి నాగఅన్వేశ్ అన్నారు. ఈ మేరకు మండల పరిధిలోని దేవగిరిపట్నం మైనార్టీ గురుకుల పాఠశాల, జగ్గన్నపేట బాలికల ఆశ్రమ పాఠశాలలో 14ఏళ్లు నిండిన విద్యార్థినులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. అనంతరం విద్యార్థినులకు సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తప్పని సరిగా వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, మాస్ మీడియా ఆఫీసర్ సంపత్, మానిటరింగ్ సూపర్‌వైజర్ సురేశ్, ఆరోగ్య కార్యకర్తలు ఉపేంద్ర, సమ్మమ్మ, నర్సింగ్ ఆఫీసర్ రాణి, స్కూల్ నర్సింగ్ ఆఫీసర్ దీపిక, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
‘దోస్త్’ సహాయ కేంద్రం ఏర్పాటు
కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం తెలిపారు. ఈ మేరకు బుధవారం కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డిగ్రీ ప్రవేశాలలో దోస్త్ అడ్మిషన్లకు సంబంధించి సాంకేతిక సమస్యలు ఎదురైతే విద్యార్థులు హెల్ప్‌లైన్ సెంటర్‌కు వచ్చి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. విద్యార్థులకు దోస్త్ రిజిస్ట్రేషన్, అడ్మిషన్‌లు మూడు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి దశ రిజిస్ట్రేషన్‌కు రూ. 200, రెండు, మూడు దశల రిజిస్ట్రేషన్‌లకు రూ.400 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు. డిగ్రీలో ప్రవేశానికి ఆధార్‌కార్డు, మొబైల్‌నంబర్, కలర్ ఫొటోలు, టెన్త్, ఇంటర్ మెమో, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడి సర్టిఫికెట్లు, కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని తెలిపారు. కళాశాలలో బీఎస్సీ(లైఫ్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బీకాం కంప్యూటర్స్, బీఏ హెచ్‌ఈపీ కోర్సులతో పాటు బీకాం (బీఎఫ్‌ఎస్‌ఐ), బీఎస్సీ (హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్) కోర్సులు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9966153683, 8978825734, 9550965334 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. వచ్చే నెల 7వ తేదీ వరకు మొదటి దశ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. ఈ నెల 30 నుంచి మే 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని, 14వ తేదీన సీట్లు కేటాయించడం జరుగుతుందని వివరించారు.


