ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగి తీగ చోరీ
ఏటూరునాగారం: మండలపరిధిలోని చిన్నబోయినపల్లి శివారులో దొంగల హల్చల్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన మూలగొండ్ల బుచ్చిరెడ్డి అనే రైతుకు చెందిన పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తు తెలియని దుండగలు పగులగొట్టి అందులోని రాగి తీగను చోరీ చేశారు. నాట్లు వేసిన రైతులు పది ఎకరాల వరకు సాగునీటికి ఎదురు చూస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం కావడంతో పొలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి పంటలకు నీరు అందక భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గ్రామ శివారులో ఇలాంటి దొంగతనాలు పెరుగుతున్నాయని, రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్ త్వరగా పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.


