రారండోయ్ మేడారం
నేటినుంచి మహా జాతర ● కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెలపైకి రాక
మలుగు/ఎస్‌ఎస్‌తాడ్వాయి/ఏటూరునాగారం: మేడారం సమ్మక్క– సారలమ్మ మహా జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం గద్దైపె కొలువుదీరనుంది. ఈ మేరకు మంగళవారం సారలమ్మ పూజారులు సమావేశమయ్యారు. వన దేవతను గద్దైపెకి తీసుకెళ్లే ముందు గుడిలో నిర్వహించే పూజాకార్యక్రమాలకు సామగ్రి సిద్ధం చేసుకున్నారు. కొత్త వెదురు బుట్టను తయారు చేసి సారయ్య ఇంటి వద్ద పవిత్రంగా ఉంచారు. సారలమ్మ గద్దైపెకి రానున్న సందర్భంగా బుధవారం ఉదయం కన్నెపల్లి గుడి నుంచి పసుపు కుంకుమ, కంకణాలు, పవిత్ర జలం తీసుకొని ఆడపడుచులు సారలమ్మ గద్దెను అలికి ముగ్గులు వేసి ముస్తాబు చేస్తారు. సారలమ్మ పూజారులతో పాటు ఆ గ్రామంలోని స్థానిక ఆదివాసీలు, కాక వంశస్తులు తమ ఇళ్లను శుద్ధి చేసుకొని మంగళహారతి ఇచ్చి మొక్కుతారు. అదేవిధంగా కొండాయి నుంచి గోవిందరాజులును ప్రధాన పూజారి దబ్బగట్ల గోవర్ధన్ తదితరులు పూజలు చేసి పడిగ రూపంలో తీసుకొస్తారు. గోవిందరాజులును వడ్డె బాబుతో కలిసి డప్పుచప్పుళ్లతో బయలుదేరగా పడిగను పట్టుకున్న వడ్డె కాళ్లకు నీళ్లు అంటకుండా మోసుకొస్తారు.
కోరికలు నెరవేర్చేందుకు
నిలువెత్తు బంగారం
సమ్మక్క–సారలమ్మను దర్శించుకునే భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరాలని నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకుంటారు. అమ్మలను కొలిచే జాతర కావడంతో అన్ని సమయాల్లోనూ మేడారానికి మహిళలు రావచ్చు. ఇక్కడే కాన్పులు అయిన మహిళలు వేలల్లో ఉంటారు.
రూ.101 కోట్లతో
గద్దెల ప్రాంగణం విస్తరణ..
మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.150 కోట్లు నిధులను మంజూరు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ 20 రోజులుగా మేడారంలో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గద్దెల ప్రాంగణాన్ని రూ.101 కోట్లతో విస్తరించారు. ఈసారి 3 కోట్ల మంది భక్తులు దర్శించుకోవడానికి అధికా రులు ఏర్పాట్లు చేశారు.
హనుమాన్ జెండా
నీడలో సారలమ్మ..
సారలమ్మను బుధవారం కన్నెపల్లి నుంచి పూజారులు కాక సారయ్య ప్రత్యేక పూజలు చేసి మేడారంలోని గద్దెకు తీసుకువస్తారు. ఇందులో భాగంగానే హనుమాన్ జెండా నీడలోనే సారలమ్మ ముందుకు సాగుతుంది. కన్నెపల్లి నుంచి మేడారం సారలమ్మ గద్దెల వరకు హనుమాన్ జెండా రక్షణలోనే సారలమ్మ గద్దెకు చేరుకుంటారు.
గుడారాలతో
నిండిన మేడారం..
గుడారాలతో మేడారం నిండిపోయింది. నార్లాపూర్ స్తూపం నుంచి మొదలుకొని జంపన్నవాగు పరిసర ప్రాంతాలు, చిలకలగుట్ట నుంచి మొదలుకొని ఆర్టీసీ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఎడ్లబండ్లు, ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చిన భక్తులు మేడారం చుట్టు పక్కల ప్రాంతాల్లో గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎటుచూసినా మేడారం పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి మొదలుకుని జంపన్నవాగు వరకు రోడ్లన్నీ భక్తులతో బారులుదీరాయి. బుధవారం ఉదయం వరకు వేలాది సంఖ్యలో వాహనాలు, లక్షల సంఖ్యలో భక్తులు రానుండడంతో మేడారం కిటకిటలాడనుంది.
రారండోయ్ మేడారం
రారండోయ్ మేడారం


