మహాజాతరకు ముస్తాబు
రేపటినుంచే మేడారంలో
తెలంగాణ కుంభమేళా
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఆదివాసీల అతి పెద్ద ఉత్సవం, తెలంగాణ కుంభమేళాకు మేడారం ముస్తాబైంది. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు రెండు వారాల ముందునుంచే గిరిజన సంప్రదాయాల ప్రకారం గుడిమెలిగె, మండమెలిగె తదితర పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఓ వైపు సమ్మక్క సారలమ్మల గద్దెల పునరుద్ధరణ పనులు జరుగుతుండగానే ఈ కార్యక్రమాలకు శ్రీకారం జరగ్గా.. ఈ నెల 28న సారలమ్మ రాకతో మొదలయ్యే జాతర 31 వరకు జరుగుతుంది. ఈ మేరకు జాతరకు ఏర్పాట్లు అన్నీ పూర్తయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ముస్తాబైన నయా మేడారం...
మేడారం చరిత్రలోనే తొలిసారిగా రూ.251 కోట్ల భారీ నిధులు కేటాయించారు. ఇందులో గద్దెల శాశ్వత పునరుద్ధరణకు రూ.101 కోట్లు, జాతర నిర్వహణ, భక్తుల సౌకర్యాలకు రూ.150 కోట్లకు పైగా నిధులు వెచ్చించారు. ఇది మేడారం చరిత్రలోనే అత్యధిక కేటాయింపు కావడం విశేషం. మేడారం అభివద్ధి పనుల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నవి కొత్తగా నిర్మించిన శాశ్వత గద్దెలు. వీటితోపాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను గ్రానైట్ రాళ్లతో పునర్నిర్మించారు. ప్రాకారం చుట్టూ ఉన్న రాతి శిలలపై కోయ గిరిజనుల వీరగాథలు, సమ్మక్క–సారలమ్మ చరిత్ర, ఆదివాసీల గోత్రాలు, వారి ఆచార వ్యవహారాలు, వీరగాథలను ప్రతిబింబించే చిత్రాలను చెక్కారు. ఇవి భవిష్యత్తు తరాలకు మేడారం చరిత్రను వివరించే సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. కాంక్రీట్ కట్టడాలు మాత్రమే కాదు.. గిరిజన సంస్కృతికి అద్దం పట్టే దృశ్యకావ్యాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి.
భద్రత వలయంలో మేడారం..
గతంలో వనదేవతల గద్దెల ప్రాంతంలో 2–3 వేల మంది ఉంటేనే తొక్కిసలాట జరిగేది. ఈసారి పునరుద్ధరణలో భాగంగా ఒకేసారి 7వేల నుంచి 8 వేల మంది భక్తులు దర్శించుకునేలా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వీఐపీలకు ప్రత్యేక లైన్లు, క్యూలైన్లపై జీఐ షీట్లతో పైకప్పు ఏర్పాటు చేశారు. నాలుగు గద్దెలను ఒకేసారి దర్శించుకునేలా కంపార్టుమెంట్లు నిర్మించారు. జంపన్న వాగు వద్ద శాశ్వత స్నానఘట్టాలు, సుందరీకరణ పనులు పూర్తిచేశారు. మేడారం చుట్టూ 10 కి.మీ.ల మేర ఫోర్ లేన్ రోడ్లు, పార్కింగ్‌కు అదనంగా 63 ఎకరాల స్థల సేకరణ చేశారు. కాగా ఈసారి 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా జాతర సందర్భంగా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలనుంచి తరలి వచ్చే భక్తుల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కాగా 460 సీసీ కెమెరాలతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీ ద్వారా రద్దీని పర్యవేక్షించే సిస్టం ఏర్పాటు చేశారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జనసాంద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రమాదాల్ని ముందుగానే నివారించే ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. 20 ప్రత్యేక డ్రోన్ల ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్, 20 మంది ఐపీఎస్ అధికారులు, 30 వేల మంది సిబ్బంది విధుల్లో ఉండబోతుండగా, ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి 2 కి.మీ.కు ఒక చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తున్నారు.
రూ.251 కోట్లతో పునరుద్ధరణ,
జాతర నిర్వహణ పనులు
జాతర ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రకటన
వనదేవతల దర్శనానికి తరలివస్తున్న భక్తులు
28 నుంచి 31 వరకు మహా జాతర..
3 కోట్లమంది వస్తారని అంచనా
మహాజాతరకు ముస్తాబు


