జిల్లా అభివృద్ధే లక్ష్యం
ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా కృషి
ఉత్తములకు అవార్డులు
– మరిన్ని వార్తలు, ఫొటోలు 9లోu
ములుగు: జిల్లా అభివృద్ధే లక్ష్యంగా అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తున్నారని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు
జిల్లాలో ఈ ఏడాది 3,811 మంది గర్భిణులు నమోదు కాగా 2,110 మందికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు చేసి రాష్ట్రంలోనే జిల్లాను ముందంజలో నిలిపామన్నారు. జిల్లాలో 108, 102 వాహనాల ద్వారా 13,856 ట్రిప్పులతో 26,285 మందిని వైద్యసేవల కోసం ఆస్పత్రికి, ఆస్పత్రి నుంచి ఇంటికి చేర్చినట్లు వెల్లడించారు. ఏటూరునాగారం సీహెచ్‌సీలో డయాలసిస్ వ్యాధిగ్రస్తులైన 297 మందికి 2,899 సెషన్స్ అందించినట్లు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 4,867 మంది వైద్యసేవలకు రూ.19.83 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు. జిల్లాలో నెలవారీగా ఓపీప 14,319 మంది, సగటు నెలవారీగా ఐపీ 1,463గా ఉందన్నారు. తెలంగాణ డియాగ్నోస్టిక్స్ పథకం ద్వారా 134 రకాల ఆరోగ్య పరీక్షలను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతినెలా 5, 20వ తేదీలలో సదరం క్యాంపుల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి అర్హులకు వికలాంగ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మహాలక్ష్మి పథకంతో లబ్ధి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా 50,117 మంది లబ్ధిదారులను గుర్తించి రూ.1.64 లక్షల సిలిండర్లు సరఫరా చేసి రూ.4.38 కోట్లకు పైగా సబ్సిడీని చెల్లించినట్లు వ్యాఖ్యానించారు. 1.72 కోట్ల మంది ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేయగా రూ.117 కోట్లను ఆర్టీసీకి చెల్లించినట్లు తెలిపారు. జిల్లాలో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉన్న 41,992 గృహాలకు రూ.27.77 కోట్ల సబ్సిడీని చెల్లించామన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం కింద జిల్లాలో 1,767 మంది గర్భిణులు, పాలిచ్చే తల్లులకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. సమగ్ర బాలల పరిరక్షణ సేవ ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 124 మంది బాలలను రక్షించామన్నారు. తొమ్మిది బాల్య వివాహాలను అరికట్టినట్లు తెలిపారు.
రైతులకు రూ.99.10 కోట్లు చెల్లింపు
రైతుభరోసా పథకంలో భాగంగా 2025 సంవత్సరానికి వానాకాలం పంటకి ఎకరానికి రూ. 6 వేల చొప్పున 79,481 రైతులకు రూ.99.10 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. రైతుబీమా పథకం కింద 2025–26 సంవత్సరంలో చనిపోయిన 87 మంది రైతు కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున రూ.4.35 కోట్లు వారి కుటుంబ సభ్యుల ఖాతాలలో జమ చేశామన్నారు. వ్యవసాయ పరికరాలను 50శాతం రాయితీపై అందించేందుకు రూ.80.60 లక్షలను కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలో ఖరీఫ్ వరకు 1,33,687 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.295.28 కోట్లను చెల్లించామన్నారు. సన్నధాన్యానికి రూ.24.21 కోట్లను బోనస్ రైతులకు చెల్లించినట్లు పేర్కొన్నారు.
పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
జిల్లాలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో భాగంగా బ్లాక్ బెర్రీ ఐలాండ్, అరణ్య క్యాంప్, లక్నవరం జంగిల్ క్యాంప్, ట్రెక్కింగ్ మార్గాలు, జలగలంచ వ్యూ పాయింట్‌ను ప్రారంభించామన్నారు. దామరవై, కొండేటి వ్యూ పాయింట్, లక్నవరం పార్క్, ఏటూరునాగారం అభయారణ్యం అటవీ విహారం కోసం జంగిల్ సఫారీ వాహనాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎకో టూరిజం డెవలప్‌మెంట్‌లో భాగంగా పర్యాటకుల కోసం తాడ్వాయి హట్స్‌ను ప్రారంభించామన్నారు. రూ.13 కోట్లతో రామప్ప ఐలాండ్‌లో అభివృద్ధి పనులు సాగుతున్నాయని వివరించారు.
సౌకర్యాల కల్పనకు రూ.151 కోట్లు
రేపటి నుంచి 31వ తేదీ వరకు మేడారంలో జరిగే సమ్మక్క–సారలమ్మ మహాజాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు రూ.151 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. 21 శాఖల ఆధ్వర్యంలో జాతర పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలందించిన అధికారులకు ప్రశంసపత్రాలను కలెక్టర్ అందజేశారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జాతీయ జెండాకు
వందనం చేస్తున్న
కలెక్టర్ దివాకర
మేడారం జాతరను
విజయవంతం చేయాలి
గణతంత్ర వేడుకల్లో
కలెక్టర్ టీఎస్.దివాకర
జిల్లా అభివృద్ధే లక్ష్యం
జిల్లా అభివృద్ధే లక్ష్యం
జిల్లా అభివృద్ధే లక్ష్యం


