వనం దారిపట్టిన భక్తజనం
అడవిబిడ్డలు అందరికీ అమ్మలైన సన్నివేశం. తెలంగాణకు శతాబ్దాల కిందటే పోరాటం అబ్బిన సందర్భం. సమ్మక్క–సారలమ్మ దివ్య చరితం. వారి త్యాగాన్ని గుర్తు చేసుకునే వేళ ఇది. పర్యావరణాన్ని రక్షించడానికి ప్రాణాలు ఫణంగా పెట్టిన వారి ధైర్యసాహసాలను స్మరించుకునే సమయం ఇది. రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర ప్రకృతిని ఆరాధించమని ఉద్బోధిస్తుంది. దైవం ముందు ధనిక, పేద తారతమ్యాలు లేవన్న సత్యాన్ని స్పష్టం చేస్తుంది.
మాఘశుద్ధ పౌర్ణమితో మొదలు
మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్క పున్నం) నుంచి జాతర మొదలవుతుంది. నాలుగు రోజుల పాటు ప్రధాన జాతర అంతా ఆదివాసీ సంప్రదాయం ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ భక్తుల నమ్మకాలే సహస్ర నామాలు, పూనకాలే హోమాది క్రతువులు. న మ్మిన వారి కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఆ తల్లీకూతుళ్ల వీరత్వమే దైవత్వం. ఆసాహసాన్ని త లుచుకొని భక్తి పారవశ్యం పొందడమే మానవత్వం. ప్రతీ మనిషిలోనూ దైవత్వం ఉందని నిరూపించే అరుదైన జాతర మేడారంలో సాక్షాత్కరిస్తుంది.
గద్దెలే దేవతామూర్తులుగా..
మేడారంలో సమ్మక్క– సారలమ్మకు ఎలాంటి విగ్రహాలు ఉండవు. రెండు గద్దెలు ఉంటాయి. ఒకటి సమ్మక్క గద్దె, ఇంకోటి సారలమ్మ గద్దె. వీటినే దేవతామూర్తులుగా కొలుస్తారు. మనిషి ఎత్తు ఉండే కంక మొదళ్ల వంక కన్నార్పకుండా చూస్తూ వన దేవతలను మనసులో ప్రతిష్ఠించుకుంటారు. దట్టమైన అడవి నుంచి దేవతలను తోడ్కొని వచ్చే వడ్డెలు (పూజారులు) తమ మీది నుంచి దాటుకుంటూ వెళ్తే జన్మ సార్థకం అవుతుందని భక్తుల నమ్మకం. పసుపు, కుంకుమ స్వరూపంగా నిలిచిన దైవాలను వాటితోనే ఆర్చిస్తారు. అమ్మవారి రూపంలో ముఖానికి పసుపు పూసుకుని పెద్దబొట్టు పెట్టుకుని వచ్చి వన దేవతలను దర్శించుకుంటారు. కంకబియ్యం (ఒడిబియ్యం), ఎదురుకోళ్లు, లక్ష్మీదేవర (గుర్రం ఆకారపు తొడుగును ముఖానికి కట్టుకుని వచ్చి దానిని అమ్మవారికి సమర్పించడం) వంటి రకరకాల మొక్కులు ఇక్కడ చెల్లించుకుంటారు. దేవతల గద్దెలపై ఉండే కుంకుమను ఎంతో పవిత్రంగా నమ్ముతారు.
వనం దారిపట్టిన భక్తజనం


