నేటి నుంచి వన్‌వే..
ఏటూరునాగారం: మేడారం మహాజాతర నేపథ్యంలో వనదేవతలను దర్శించుకునేందుకు ప్రైవేట్ వాహనాల్లో వచ్చే వారికి తాడ్వాయి ఆర్చీ మీదుగా అనుమతి లేదని పోలీసులు మంగళవారం వెల్లడించారు. ప్రైవేట్ వాహనాలు ఏటూరునాగారం మండల పరిధిలోని కొండాయి– ఊరట్టం మీదుగా మేడారం చేరుకునేలా వన్‌వేను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రహదారి గుండా వచ్చిన వాహనాలు ఈ రహదారి నుంచే తిరుగు ప్రయాణం జరిగేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పస్రా మీదుగా మేడారం చేరుకునే వాహనాలను బయ్యక్కపేట మీదుగా భూపాలపల్లికి మళ్లించడంతో వాహనాల ట్రాఫిక్ జామ్ లేకుండా సజావుగా వెళ్తాయని వివరించారు. ఈ నెల 31వ తేదీ వరకు వన్‌వే ఆంక్షలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.
ములుగు రూరల్: మేడారం మహాజాతరలో ప్రధాన ఆస్పత్రిలో వైద్యులు చీకట్లోనే రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. మేడారంలో టీటీడీ కల్యాణ మండపంలో జాతరకు ప్రధాన ఆస్పతిగా ఉన్న 50 పడకల ఆస్పత్రిలో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో వైద్యులు ఇబ్బందులు పడ్డారు. చీకట్లో వైద్య పరీక్షలు నిర్వహించి ప్రిస్క్రిప్షన్ రాసేందుకు సెల్‌ఫోన్ లైట్లను వినియోగించి సేవలు అందించారు. విద్యుత్ సరఫరా ఉదయం నుంచి నిలిచిపోయిందని సిబ్బంది తెలిపారు.
ములుగు రూరల్: మేడారం మహాజాతర సమ్మక్క–సారలమ్మ తల్లుల దర్శనానికి బయలుదేరిన భక్తులు ఆదిదేవత గట్టమ్మ తల్లికి మొదటి మొక్కులు చెల్లించారు. మంగళవారం భక్తులు అమ్మవారికి పుసుపు– కుంకుమలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న అమ్మవార్ల గద్దెలకు మొక్కులు చెల్లించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అనంతరం భక్తులు మేడారం బయలుదేరి వెళ్లారు.
ఏటూరునాగారం: మేడారంలో ఏర్పాటు చేసుకున్న షాపులను తూనికలు, కొలతల అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వరంగల్ జోన్ అసిస్టెంట్ కంట్రోలర్ రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో 40 షాపులను తనిఖీ చేసి 10 షాపులకు చెందిన యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తే షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే తూకం వేసే మిషనరీలు, కాంటాలు ముద్రవేసుకొని ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌ఎంలు, ఇన్‌స్పెక్టర్లు ప్రవీన్‌కుమార్, మనోహర్, ఝాన్సీ, శ్రీలత, విశ్వేశ్వర్ పాల్గొన్నారు.
నేటి నుంచి వన్‌వే..
నేటి నుంచి వన్‌వే..
నేటి నుంచి వన్‌వే..


