హిట్‌ సినిమాను ప్లాన్‌ చేయలేం

Vishwaksen Talks About Ori Devuda Movie Press meet - Sakshi

‘‘నేను ఓ యాక్టర్‌గా అత్యాశ పడకూడదని, తొందరపడకూడదని ఫిక్స్‌అయ్యాను. కొంతకాలం వరకు డిఫరెంట్, ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే ఉంటాను. యాక్టర్‌గా కొంత దూరం ప్రయాణించాక.. అంటే నాకు ముప్పై ఏళ్లు దాటిన తర్వాత బాక్సాఫీస్‌ నంబర్‌ ఫార్ములా, స్టార్‌ కావడం ఎలా? వంటి అంశాలపై దృష్టిపెడతాను. అప్పటి వరకు క్రమశిక్షణతో ఓ ఫ్లోలో సినిమాలు చేసుకుంటూ వెళతాను’’ అని విష్వక్‌ సేన్‌ అన్నారు.

అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో విష్వక్‌సేన్‌ హీరోగా, వెంకటేశ్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఓరి దేవుడా..!’. ఈ సినిమాలో ఆశాభట్, మిథిలా పాల్కర్‌ హీరోయిన్స్‌గా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో విష్వక్‌ సేన్‌ చెప్పిన విశేషాలు...

► తమిళం చిత్రం ‘ఓ మై కడవులే’ చిత్రానికి ‘ఓరి దేవుడా..!’ సినిమా తెలుగు రీమేక్‌. ‘ఓ మై కడవులే..’ చిత్రంలో దర్శకునిగా అశ్వత్‌ ఏమైతే చేయాలేకపోయాడో అవన్నీ ‘ఓరి..దేవుడా..!’ లో చేశాడు. అలా సినిమా అప్‌గ్రేడ్‌ అయ్యింది.

► వెంకటేశ్‌గారితో వర్క్‌ చేయడం నా లైఫ్‌లో నేను ఊహించని సర్‌ప్రైజ్‌. నా అదృష్టం కూడా. సల్మాన్‌ఖాన్‌గారి సినిమాతో వెంకటేశ్‌గారు బిజీగా ఉండటం వల్లే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోయారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నా గురించి రామ్‌చరణ్‌గారు మంచిగా మాట్లాడటం సంతోషంగా ఉంది.. అది ఆయన గొప్పదనం.

► ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ వంటి సినిమా చేయొద్దని నాకు చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ యాక్టర్‌గా నాకు ఇంకా మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ సినిమాయే. ఇక హిట్‌ సినిమాలును ప్లాన్‌ చేసి తీయలేం. గొప్ప సినిమాలు ఏవైనా మనల్ని వెతుక్కుంటూనే రావాలి.

► కాల్షీట్స్‌ సర్దుబాటు కుదరక పోవడం వల్లే ‘హిట్‌ 2’ చేయలేకపోయా. ‘దాస్‌ కా దమ్కీ’ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. అర్జున్‌గారి దర్శకత్వంలో నేను చేస్తున్న సినిమా షూటింగ్‌లో నవంబరు 3 నుంచి పాల్గొంటాను.  ‘గామీ’ సినిమాకు సీజీ వర్క్‌ ఎక్కువ చేయాల్సి ఉంది. అందుకే ఆలస్యం అవుతోంది. ‘ఫలక్‌నుమాదాస్‌ 2’ షూటింగ్‌ వచ్చే ఏడాది చివర్లో ప్రారంభం అవుతుంది. నిర్మాత రామ్‌ తాళ్లూరిగారితో ఓ సినిమా చేస్తున్నా. కొత్త దర్శకుడు రవితేజ ఈ సినిమాకు వర్క్‌ చేస్తారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top