‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ | Sakshi
Sakshi News home page

Vidya Vasula Aham Review: క్యూట్‌ ఈగోస్‌ ఉన్న ఫన్‌ మూవీ

Published Fri, May 17 2024 6:57 PM

Vidya Vasula Aham Movie Review And Rating In Telugu

టైటిల్‌: విద్య వాసుల అహం
నటీనటులు: రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌, అవసరాల శ్రీనివాస్‌, అభినయ, తనికెళ్ల భరణి, శ్రీనివాస్‌ రెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మి తదితరులు
నిర్మాణ సంస్థ: ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి 
దర్శకత్వం: మణికాంత్‌ గెల్లి
సంగీతం: కళ్యాణి మాలిక్‌
ఎడిటర్‌ : అఖిల్‌ వల్లూరి
ఓటీటీ స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా(మే 17 నుంచి)

ఈ మధ్య కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. అలా ఈ వారం(మే 17) రిలీజ్‌ అయిన సినిమానే ‘విద్య వాసుల అహం’. రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ జంటగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది. దానికి తోడు థియేటర్‌ సినిమా మాదిరి ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘విద్య వాసుల అహం’ కాస్త హైప్‌ క్రియేట్‌ అయింది. మంచి అంచనాలతో రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
వాసు(రాహుల్‌ విజయ్‌) ఓ సంస్థలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌గా పని చేస్తుంటాడు. పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్లు బలవంతం చేసినా..అతను మాత్రం ఇంట్రెస్ట్‌ చూపించడు. మరోవైపు విద్య(శివాని) కూడా అంతే. పెరెంట్స్‌ పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడినా.. ఆమె దృష్టి మాత్రం ఉద్యోగం మీదనే ఉంటుంది. ఓ గుడిలో విన్న ప్రవచనాలతో అటు రాహుల్‌కి, ఇటు విద్యకి పెళ్లిపై ఇంట్రెస్ట్‌ కలుగుతుంది. పెళ్లి సంబంధాలు చూడమని ఇంట్లో గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఇద్దరి పేరెంట్స్‌ ఆ పనిలోనే ఉంటారు. అలా ఓ పెళ్లిళ్ల బ్రోకర్‌ ద్వారా ఇద్దరికి సంబంధం కుదురుతుంది. 

పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటారు. ఇద్దరికి ఉన్న ఈగోల కారణంగా మొదటి రాత్రే గొడవలు మొదలవుతాయి. మరి ఆ గొడవలు ఎక్కడికి దారి తీశాయి? ఇద్దరికి ఉన్న ఆహం ఎలాంటి విబేధాలను తెచ్చిపెట్టింది? ఏ విషయంలో విరిద్దరి మధ్య గొడవలు జరిగాయి?  గొడవ జరిగినప్పుడల్లా ఇద్దరిలో ఎవరు తగ్గారు? ఉద్యోగం కోల్పోయిన వాసుకి విద్య సపోర్ట్‌గా నిలిచిందా లేదా? విద్య వాసులు ఇగోతోనే ఉంటారా? లేదా వివాహ బంధాన్ని ఎంజాయ్‌ చేస్తారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
పెళ్లి సబ్జెక్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అయినా కూడా కాస్త ఎంటర్‌టైనింగ్‌గా తీస్తే చాలు టాలీవుడ్‌ ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తారు. దర్శకుడు మణికాంత్‌ ఆ పనే చేశాడు. ఎంచుకున్న కథ రొటీనే అయినా.. చాలా ఎంటర్‌టైనింగ్‌ కథనాన్ని మలిచాడు. కథంతా క్యూట్‌గా సాగిపోతుంది. ఎక్కడా కూడా బోర్‌ కొట్టదు. ‘పరస్పరం గౌరవం వివాహానికి పునాది’ అనే సందేశాన్ని చాలా వినోదభరితంగా ఇచ్చాడు. అహంతో కూడిన ప్రేమ‌క‌థ‌లోని భావోద్వేగాల‌ను తెరపై చక్కగా పండించాడు.

పెళ్లి జీవితంలో ప్రేమ బాధ్యతల మధ్యలో ఇగో వస్తే ఎలా ఉంటుంది అనే నేపథ్యంలో కథనం సాగుతుంది. ఫస్టాప్‌లో కొత్తగా పెళ్లైన జంట ఎలా ఉంటుంది? చిన్న చిన్న విషయాల్లో ఈగోలకి వెళ్లి ఎలా గొడవ పడతారు? అనేది వినోదాత్మకంగా చూపించాడు. ఇక సెకండాఫ్‌లో పెళ్లయిన తర్వాత వచ్చే సమస్యలు.. ఇగోల కారణంగా వచ్చే ఇబ్బందలను చూపించారు. భార్యభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు వస్తుంటాయి పోతుంటాయి కానీ.. వివాహం బంధం బలంగా ఉండాలి అనే మంచి సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇచ్చారు. కొత్తగా పెళ్లి అయిన ప్రతి జంట..ఈ సినిమాకు కనెక్ట్‌ అవుతుంది. 

అయితే కథలో మాత్రం కొత్తదనం ఉండదు. కొన్ని సన్నివేశాలు పాత సినిమాలను గుర్తుకు చేస్తాయి. ఓటీటీ సినిమానే కదా అన్నట్లుగా కొన్ని సన్నివేశాలను సింపుల్‌గా చుట్టేశారనే ఫీలింగ్‌ కలుగుతుంది. స్క్రీప్‌ప్లే ఇంకాస్త బలంగా రాసుకుంటే  బాగుండేదేమో.  డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్‌ చేయడం సినిమాకు ప్లస్‌ పాయింట్‌.  ఓటీటీలోనే స్ట్రీమింగ్‌ అవుతుంది కాబట్టి ఎంటర్‌టైన్‌ కావడానికి వీకెండ్‌లో ఈ సినిమాను ఓసారి చూడొచ్చు. 

ఎవరెలా చేశారంటే..
ఈ జనరేషన్‌ భార్య భర్తలుగా రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ఇద్దరూ పోటీ పడి నటించారు. వీరిద్దరి మధ్య ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది.ఈగోస్‌తో ఇద్దరి మధ్య జరిగే గొడవలు నవ్వులు పూయిస్తాయి. శివానీ శారీలోనే కనిపిస్తూనే కావాల్సిన చోట అందాలను ప్రదర్శించింది. ఈ జనరేషన్ కొత్త పెళ్ళికొడుకుగా రాహుల్‌ విజయ్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.  ఇక విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్‌, లక్ష్మీ దేవిగా అభినయ, నారదుడిగా శ్రీనివాస్ రెడ్డితో పాటు  తనికెళ్ల భరణి, శ్రీనివాస్‌ రెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మీ తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

సాంకేతికంగా సినిమా బాగుంది.కల్యాణి మాలిక్ మ్యూజిక్ సినిమాకు ప్లస్‌ అయింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.  
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌ 

Rating:
Advertisement
 
Advertisement
 
Advertisement