Vidya Balan: అలా కామెంట్‌ చేసినందుకే షాహిద్‌కి గుడ్‌బై!

Vidya Balan And Shahid Kapoor Breakup Story In Telugu - Sakshi

మొహబ్బతే

షా హిద్‌ కపూర్‌.. బాలీవుడ్‌ లవర్‌ బాయ్‌. తను కలిసి నటించిన కథానాయికలు అందరి (దాదాపుగా)తో ప్రేమలో పడ్డాడు.. కరీనా కపూర్‌తో అతని లవ్‌ స్టోరీ మినహా మిగిలినవన్నీ వదంతులుగానే ప్రచారమయ్యాయి. అందులో ఒకటే విద్యాబాలన్‌తో ఇష్క్‌. 

ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా కిస్మత్‌ కనెక్షన్‌. దాంతోనే వీళ్ల పరిచయం మొదలైంది. ఆ షూటింగ్‌ జరుగుతుండగానే ఆ స్నేహం ప్రేమగా మారింది. ఎప్పటిలాగే ఆ ప్రేమ కబుర్లు పుకార్లుగా షికార్లు చేశాయి. వాటిని మీడియా కూడా క్యాచ్‌ చేసింది. వాటి కోసం పత్రికలు, చానెళ్లలో ప్రముఖ స్థానాన్ని, ప్రైమ్‌ టైమ్‌నూ కేటాయించింది. ఆ ప్రచారానుసారం షాహిద్, విద్యల ప్రేమ కిస్మత్‌ కనెక్షన్‌ విడుదల తర్వాత కొన్ని నెలల వరకూ సాగింది. ఇంక అది పెళ్లితో పదిలం కానుందని షాహిద్‌ సన్నిహితులు అనుకునేలోపే వాళ్ల బ్రేకప్‌ వార్త వినిపించింది. 

కారణం.. షాహిద్‌ దుందుడుకుతనం, దురుసు ప్రవర్తన అని తేల్చారు ఆ ఇద్దరి సన్నిహితులు. విద్యా బాలన్‌ వెయిట్‌ గురించి కామెంట్‌ చేశాడట షాహిద్‌. ఒక్కసారి కాదు పదేపదే. గౌరవం లేని ప్రేమ మనజాలదు.. అదెప్పటికైనా ఇద్దరి దారులను వేరు చేయక తప్పదు అని గ్రహించింది విద్యా. మారు మాట్లాడకుండా షాహిద్‌కు గుడ్‌ బై చెప్పింది... కెరీర్‌ మీద ప్రేమను పెంచుకుంది. 

‘మనం ఇష్టపడేవారు మనల్ని చులకనగా చూస్తుంటే మనసు విరిగి పోతుంది. ఆ చనువును మన చేతకానితనంగా తీసుకుంటే తట్టుకోలేం. నా విషయంలో అదే జరిగింది. ఆ వ్యక్తి .. పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు.. అతని పట్ల  నాకున్న ఇష్టాన్ని అలుసుగా తీసుకొని నాలో లోపాలు వెదుకుతూ, వెటకారమాడుతుంటే భరించలేకపోయా. ఆ బంధం కన్నా  నా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం ముఖ్యమనుకున్నా. అందుకే ఆ రిలేషన్‌లోంచి బయటకు వచ్చేశా’ అని చెప్పింది విద్యాబాలన్‌ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.
 
ఆమె అలా  అతని అహంకారాన్ని ప్రశ్నించినా షాహిద్‌కేమీ పట్టలేదు. ఆ బ్రేకప్‌ను చాలా తేలికగా తీసుకున్నాడు. అతనూ ఒక ఇంటర్వ్యూలో  ‘నా కోస్టార్ట్స్‌లో ఇద్దరిని అమితంగా ఇష్టపడ్డాను. అందులో ఒకరు ఇష్టపడ్డ మనిషిని మోసం చేయడంలో ప్రసిద్ధులు’ అంటూ పేర్కొన్నాడు. ఆ ఇద్దరిలో ఒకరు కరీనా కపూర్, ఇంకొకరు ప్రియాంక చోప్రానా? లేక విద్యా బాలనా?  ఈ ఇద్దరిలో ఆ రెండో వ్యక్తి ఎవరో మీడియాకు అంతుచిక్కలేదు.  

కాఫీ విత్‌ కరణ్‌లో...
షాహిద్‌ కపూర్‌తో ఉన్న స్నేహం గురించి విద్యా బాలన్‌ను అడిగాడు కరణ్‌ జోహార్‌ తన ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో. ‘కొంత కాలంగా ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న. ఆ పేరుతో నన్ను జత పర్చడం వినీ వినీ విసుగెత్తిపోయా. ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలతో నటించా.. ఇంకెవరి పేరుతోనైనా జత చేయండి. అంటే  నిప్పు లేందే పొగరాదని కాదు నా ఉద్దేశం.. ఆ నిప్పు రాజేసిన వాళ్ల పేరు చెప్పను అంటున్నానంతే’ అని  కౌంటర్‌ ఇచ్చింది విద్యా బాలన్‌. ఆ తర్వాత ఇంకేదో సందర్భంలో ఇంకేదో పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఎస్‌.. మేమిద్దరం రిలేషన్‌లో ఉన్నాం ఒకప్పుడు. అది ఫ్రెండ్‌షిప్‌. అతను నా కోస్టార్‌’ అని బదులిచ్చింది.

విద్యాబాలన్‌ ఇచ్చిన ఈ జవాబుతో షాహిద్‌ దగ్గర ఇంకేదో రాబట్టాలని చూసిన మీడియాకు నిరాశే ఎదురైంది ‘ఆమెకు నాకు మధ్య ఫ్రెండ్‌షిప్‌ కూడా లేదు.. భవిష్యత్‌లో ఆమెతో నటించేదీ లేదు’ అన్న షాహిద్‌ సమాధానంతో. దీనికీ విద్యా కౌంటర్‌ ఇచ్చింది.. ‘ఫ్రెండ్‌షిప్‌కు అతను ఇచ్చే నిర్వచనమేంటో నాకు తెలీదు కానీ ‘కిస్మత్‌ కనెక్షన్‌’ సినిమా టైమ్‌లో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌మి. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధమే ఉండింది.. అయితే అది ప్రేమ కాదు.. అందులో రొమాన్స్‌ లేదు. నాతో నటించకూడదు అనుకోవడం అతని ఇష్టం. అతని ఆ  నిర్ణయంతో నాకేం ఇబ్బంది లేదు.. ఇండస్ట్రీలో అతనొక్కడే హీరో అయితే తప్ప’ అంటూ. 

‘హమారీ అధూరీ కహానీ’ సినిమా ప్రమోషన్‌ సమయంలో విద్యా ‘నా కెరీర్‌లోనే కాదు జీవితంలోనే స్పెషల్‌ మూవీ ఇది. షూటింగ్‌ పూర్తయ్యాక ఒకరకమైన ప్రశాంతతను.. మనశ్శాంతినీ పొందాను. నా ప్రేమ కథ పూర్తయినట్టనిపించింది’ అని చెప్పింది. ఆ మాటలు షాహిద్‌ గురించేననే కథనాన్ని అల్లేసింది మీడియా.  ఏమైనా షాహిద్‌కు విద్యా పట్ల ప్రేమ ఉండిందో లేదో తెలియదు కానీ విద్యా మాత్రం షాహిద్‌ను మనసారా ప్రేమించింది. దీనికి నిదర్శనం.. మీరా రాజ్‌పుత్‌ షాహిద్‌తో పెళ్లి నిశ్చయం కాగానే విద్యా గురించి ఆరా తీసిందట ఇంకా ఆమె మనసులో అతను ఉన్నాడేమోననే సందేహ నివృత్తి కోసం!

కరీనా, విద్యా బాలన్‌తోనే కాదు షాహిద్‌ పేరు, ప్రేమ సోనాక్షి సిన్హా, ప్రియాంక చోప్రా, అమృతా రావుతోనూ వినిపించాయి. ఎవరితోనూ సీరియస్‌గా లేడు షాహిద్‌.. అనే నిందా వినిపించింది.. కనిపించింది.. మీరా రాజ్‌పుత్‌ను జీవితభాగస్వామిగా చేసుకోవడంతో.  
-ఎస్సార్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top