Producer TG Vishwa Prasad Talks About Adipurush Movie Theatrical Business Deals, Deets Inside - Sakshi
Sakshi News home page

TG Vishwa Prasad: రూ. 185 కోట్లతో ‘ఆదిపురుష్‌’ తెలుగు రిలీజ్‌ హక్కులు కొన్నాం

Jun 14 2023 10:13 AM | Updated on Jun 14 2023 11:07 AM

TG Vishwa Prasad Talk About Adipurush Movie - Sakshi

‘‘సినిమా అనేది ఓ ప్రయాణం. ఈ ప్రయాణంలో విజయాలు, అపజయాలు ఉంటాయి. అయితే అపజయాలు వచ్చినప్పుడు అవి పునరావృతం కాకుండా  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్చుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌. రామాయణం ఆధారంగా రూపొందిన తాజా  పౌరాణిక చిత్రం ‘ఆది పురుష్‌’. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్తా, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. భూషణ్‌ కుమార్, క్రిషణ్‌కుమార్, ఓమ్‌ రౌత్, ప్రసాద్‌ సుతార్, రాజేష్‌ నాయర్, వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది.

కాగా తెలుగు సినిమా రిలీజ్‌ హక్కులను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో టీజీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘ఆదిపురుష్‌’ను తెలుగులో విడుదల చేయమని ప్రభాస్‌గారు చెప్పలేదు. అయితే ఈ అవకాశం గురించి ఆయనతో చర్చించిన తర్వాతే ‘ఆదిపురుష్‌’ని తెలుగులో విడుదల చేస్తున్నాం. తెలుగు హక్కులను జీఎస్టీతో కలిపి రూ. 185 కోట్ల రూపాయలకు తీసుకున్నాం. టీ– సిరీస్‌ నిర్మాణ సంస్థ పాన్‌ ఇండియా సినిమాలను ప్రొడ్యూస్‌ చేస్తోంది. టీ సిరీస్‌ ప్రొడక్షన్‌లో ప్రభాస్‌ హీరోగా రానున్న మరో సినిమా ‘స్పిరిట్‌’ని కూడా మేమే తెలుగులో విడుదల చేస్తాం.

ఇక ‘ఆదిపురుష్‌’ సినిమా తెలుగు బుకింగ్స్‌ బుధవారం ఉదయం నుంచి ఓపెన్‌ అవుతాయి. ఓ సినిమా టికెట్‌ ధర పెంపుదల విషయం గురించి ప్రభుత్వాలతో చర్చించడం మాకిదే తొలిసారి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పాజిటివ్‌గానే స్పందించాయి. ఏపీ సీఎం జగన్‌గారు అప్రూవ్‌ చేశారు. ‘ఆదిపురుష్‌’ సినిమా టికెట్‌ ధరలను యాభై రూపాయలు పెంచుకునే అనుమతులు రెండు తెలుగురాష్ట్రాల్లో లభించాయి. అయితే ఇది సింగిల్‌ స్క్రీన్స్‌లో మాత్రమే. మా నిర్మాణ సంస్థలో త్వరితగతిన వంద సినిమాలను పూర్తి చేయాలన్నది మేం రీసెంట్‌గా సెట్‌ చేసుకున్న గోల్‌.

మా బ్యానర్‌లో పాతిక చిత్రాలు రావడానికి ఐదేళ్లకు పైనే పట్టింది. కానీ మా 50వ సినిమా మైలురాయిని వచ్చే ఏడాదే చేరుకోబోతున్నాం. నాలుగైదు సినిమాల షూటింగ్స్‌ పూర్తయ్యాయి. పదిహేను సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.  థియేటర్స్‌ బిజినెస్‌కు తోడు ఓటీటీ రైట్స్‌ బిజినెస్‌ కూడా ఉపయోగపడుతోంది. అందుకే మేం ఎక్కువ సినిమాలు చేయగలుగుతున్నాం. మా బ్యానర్‌లో వచ్చిన పాన్‌ ఇండియా మూవీ ‘కార్తికేయ 2’ తర్వాత మరిన్ని పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ రాబోతున్నాయి. పాన్‌ వరల్డ్‌ స్థాయిలో సినిమాలను నిర్మించాలనేది మా లక్ష్యం. రాబోయే రెండు మూడేళ్లలో మేం హాలీవుడ్‌లో కూడా సినిమాలు నిర్మిస్తాం’’ అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement