
కమల్ హాసన్ హీరోగా నటించిన ‘థగ్ లైఫ్’(Thug Life) చిత్రానికి సుప్రీ కోర్టు(supreme court of india)లో భారీ ఊరట లభించింది. కర్ణాటకలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అంతేకాదు ఈ సినిమాను నిలిపివేయాలంటూ బెదిరించిన సంఘాలను సుప్రీం కోర్టు హెచ్చరించింది. థియేటర్స్‌లో ఏమి ప్రదర్శించాలనే అధికారం గుంపులకు, ఆరాచక శక్తులకు లేదని, మూక బెదిరింపులకు చట్ట పాలనను తాకట్టు పెట్టలేమని కోర్టు పేర్కొంది. సెన్సార్ బోర్డు అనుమతి పొందిన ఏ సినిమానైనా విడుదల చేయాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
అలాగే కమల్ వ్యాఖ్యలను వ్యతిరేకించే హక్కు కర్ణాటక ప్రజలకు ఉందని, ప్రాథమిక హక్కులను కాపాడాలని ధర్మాసనం పేర్కొంది. ‘కమల్ వ్యాఖ్యలు తప్పు అని కర్ణాటక, బెంగళూరు వాసులు నమ్మితే.. అలా చెబుతూ ఒక ప్రకటన జారీ చేయవచ్చు. సినిమా థియేటర్లను తగలబెట్టాలని ఎందుకు బెదిరిస్తున్నారు?’ అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
చిత్ర నిర్మాత దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు నుంచి తనకే బదిలీ చేసుకున్న సుప్రీం కోర్టు.. దీనిపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. అలాగే ఈ విషయంలో క్షమాపణలు చెప్పాలంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పు పట్టింది.
అసలేం జరిగిందంటే..
కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ సినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని అన్నారు. ఆయన చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకీ దారి తీశాయి. కమల్ వ్యాఖ్యలపై కన్నడిగులు భగ్గుమన్నారు. క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఆయన క్షమాపణలు చెప్పకపోవడంతో కర్ణాటకలో ఈ సినిమా విడుదలను నిషేధించారు. దీనిపై చిత్రబృందం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. నేడు ఆదేశాలు జారీ చేసింది.