Superstar Krishna Death Funeral Live Updates In Telugu, Celebrities Pay Tribute - Sakshi
Sakshi News home page

Superstar Krishna Death Funeral Live Updates: కృష్ణ అంత్యక్రియలు.. కడసారి చూపులకు పోటెత్తిన అభిమానం

Published Wed, Nov 16 2022 8:37 AM

Superstar Krishna Death Funerals Live Updates In Telugu, Celebrities Pay Tributes - Sakshi

అభిమానుల అశ్రునయనాల మధ్య సూపర్ ‍స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నటశేఖరుడి సినీ ప్రస్థానం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిసింది. పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవవందనం చేశారు. 

అభిమానుల అశ్రునయనాల మధ్య సూపర్ ‍స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నటశేఖరుడి సినీ ప్రస్థానం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిసింది. పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవవందనం చేశారు. 

సూపర్‌స్టార్‌ కృష్ణ అంతిమయాత్ర పద్మాలయ స్టూడియోస్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి చేరుకుంది. ప్రభుత్వ లాంఛనాలతో మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరుగుతున్నాయి. 

సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర ‍ప్రారంభమైంది. లక్షలాది అభిమానుల మధ్య ఆయన అంతిమయాత్ర కొనసాగుతోంది. పద్మాలయ స్టూడియోస్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగనుంది.
 

సూపర్‌స్టార్‌ కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించేందుకు అభిమానులు పోటెత్తారు. అభిమానుల రాకతో పద్మాలయ స్టూడియోస్ కిక్కిరిసిపోయింది. కాసేపట్లో ఆయన అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మహాప్రస్థానంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

► సూపర్‌స్టార్‌ కృష్ణ పార్థివదేహాన‍్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సందర్శించారు. ఆయనకు నివాళులు అర్పించి అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. కృష్ణ నిర్మాతల హీరో అన్నారు. నిర్మాతల బాగోగులు కోరుకున్న ఒకే ఒక్క హీరో ఆయన అని అల్లు అరవింద్‌ పేర్కొన్నారు. 

► పద్మాలయ స్టూడియో ప్రాంగణం అంతా జనాలతో కిక్కిరిసి పోయింది. తమ అభిమాన నటుడిని కడాసారి చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో పోటెత్తారు. దీంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. బారికేడ్లు తోసుకుని అభిమానులు ఒక్కసారిగా లోపలికి వెళ్లారు. దీంతో జనాలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జికి దిగారు. 

► సూపర్‌ స్టార్‌ కృష్ణ పార్థివదేహానికి సినీ నటి జయప్రద నివాళులు అర్పించారు. ఆనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ లెజెండరి హీరో అన్నారు. హైదరాబాద్‌కు తెలుగు ఇండస్ట్రీ రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన పట్టుదలతో పనిచేసే వ్యక్తి అంటూ జయప్రద కన్నీరు పెట్టుకున్నారు. 

► సూపర్‌ స్టార్‌ కృష్ణ పార్థివదేహానికి ఏపీ మంత్రి రోజా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణ అద్భుతమైన వ్యక్తి అని,  సాహసాలు.. సంచనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అంటూ కృష్ణ మృతి పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

  కృష్ణ పార్థివదేహానికి తెలంగాణ గవర్నర్‌తమిళి సై నివాళులర్పించారు. 

► సూపర్‌స్టార్‌ కృష్ణ పార్థివదేహానికి  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియోస్‌కి చేరుకున్న ఆయన .. కృష్ణకు పుష్పాంజలి ఘటించారు.  అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహేశ్‌ని హత్తుకుని ధైర్యం చెప్పాడు. 

► కృష్ణ భౌతికకాయానికి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించాడు.  ఫ్యామిలీతో కలిసి పద్మాలయ స్టూడియోకు వచ్చిన బాలకృష్ణ.. పూలమాల వేసి అంజలి ఘటించారు. 

► పద్మాలయ స్టూడియోకి సినీ తారలు తరలివస్తున్నారు. సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు, నటుడు అలీ, ఆయన సోదరుడు ఖయ్యూంలు కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించారు. 

మహేశ్‌బాబు తనయుడు గౌతమ్‌, కూతురు సితారలు వారి తాత పార్ధివదేహానికి నివాళులర్పించారు. 

► జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానం లో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల కి ఏర్పాట్లు చేస్తున్నారు. మహా ప్రస్థానం వద్ద కార్యక్రమం జరుగుతున్న సమయంలో బయటకి వ్యక్తులు లోపలకి రాకుండా భారీ ప్రైవెట్ భద్రత ఏర్పాటు చేశారు. 

► తండ్రిని తలచుకుంటూ కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది. 

► కృష్ణ మృతిపట్ల సినీ పరిశ్రమ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కృష్ణ మృతికి గౌరవ సూచికంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ తెలుగు సినీ పరిశ్రమ నేడు బంద్‌ పాటిస్తోంది.

సూపర్‌స్టార్‌ కృష్ణ భౌతికకాయానికి నివాళ్లు అర్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం  హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. హైదరాబాద్‌ పద్మాలయా స్టూడియోస్‌కు చేరుకుని.. సూపర్‌స్టార్‌ కృష్ణ పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించనున్నారు. అనంతరం ఘట్టమనేని కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు.

అభిమానుల సందర్శనార్ధం కృష్ణ భౌతికకాయం పద్మాలయ స్టూడియోకి తీసుకొచ్చారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అభిమానులు సందర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. 12 గంటల తరువాత అంతిమయాత్ర, మహా ప్రస్ధానంలో అంత్యక్రియులు జరగనున్నాయి.

సూపర్‌స్టార్ కృష్ణను కడసారి చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీగా పద్మాలయ స్టూడియోస్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పద్మాలయా స్టూడియోస్‌ దగ్గర పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement