హైకోర్టు సీరియస్‌.. స్పందించిన రజనీ

Super Star Rajini Reacts Over Raghavendra Wedding Hall Issue - Sakshi

చెన్నై : రాఘవేంద్ర కళ్యాణ మండపానికి సంబంధించిన ఆస్తి పన్ను వ్యవహారంపై సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌పై మద్రాస్‌ హైకోర్టు సీరియస్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ గురువారం ట్విటర్‌ వేదికగా దీనిపై స్పందించారు. ‘‘ఆస్తి పన్ను వ్యవహారంపై మద్రాస్‌ హైకోర్టుకు బదులుగా చెన్నై కార్పొరేషన్‌ను సంప్రదించి.. ఆ తప్పు జరగకుండా చూడాల్సింది’’’అని పేర్కొన్నారు. ‘‘ అనుభవమే పాఠం’’ అన్న హ్యాస్‌ ట్యాగ్‌ను ఆయన జత చేశారు.

కాగా, రజనీకాంత్‌కు చెందిన రాఘవేంద్ర కల్యాణ మండపానికి సంబంధించి ఆరునెలలకు గానూ ఆస్తి పన్ను కింద చెన్నై కార్పొరేషన్‌కు రూ.6.50 లక్షలు చెల్లించాల్సి ఉంది. దీన్ని సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టులో రజనీకాంత్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.  ఆ పిటిషన్‌లో ‘‘ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన ఆస్తి పన్ను చెల్లించాను. ఈ నేపధ్యంలో కల్యాణ మండపానికి ఆస్తి పన్ను నిర్ణయించి ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు కాలానికి రూ.6.50 లక్షలు చెల్లించాలని సెప్టెంబరు 10వ తేదీన చెన్నై కార్పొరేషన్‌ నోటీసు జారీచేసింది. గడువులోగా చెల్లించకుంటే 2 శాతం జరిమానా విధించాల్సి వస్తుందని నోటీసులో పేర్కొంది. ( మీరు లేకపోతే నేను లేను! )

కరోనా వైరస్‌ ప్రకృతి వైపరీత్య కాలాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మార్చి నుంచి కల్యాణ మండపాన్ని మూసివేశాము. అప్పటికే అడ్వాన్సులు చెల్లించినవారికి సొమ్ము వాపస్‌ చేశాము. ఆదాయమే లేని కల్యాణమండపానికి ఆస్థిపన్ను చెల్లించాలని కార్పొరేషన్‌ జారీచేసిన నోటీసును అంగీకరించము. ఆస్థిపన్నును 50 శాతం తగ్గించాలని కార్పొరేషన్‌కు రాసిన ఉత్తరానికి బదులులేదు. కాబట్టి కల్యాణమండప ఆస్తి పన్ను నోటీసును రద్దు చేయాల’’ని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ‘మీ ఉత్తరంపై అధికారులు ఆలోచించుకునే అవకాశం కూడా ఇవ్వరా...అంతలోనే కోర్టులో పిటిషనా... కోర్టు సమయాన్ని వృధా చేసిన మీపై జరిమానా విధించి పిటిషన్‌ను కొట్టివేయాల్సి వస్తుంది’ అంటూ  ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top