కోట శ్రీనివాసరావుతో ఏరా ఏరా అనుకునే స్నేహం | Sripada Jithmohan Mitra condolences to Kota Srinivasa Rao | Sakshi
Sakshi News home page

కోట శ్రీనివాసరావుతో ఏరా ఏరా అనుకునే స్నేహం

Jul 14 2025 12:46 PM | Updated on Jul 14 2025 1:38 PM

Sripada Jithmohan Mitra condolences to Kota Srinivasa Rao

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌):  కోట శ్రీనివాసరావు మరణం పట్ల నట గాయకుడు శ్రీపాద జిత్‌మోహన్‌మిత్రా తీవ్ర సంతాపం తెలిపారు. ‘కోట, నేను కలిసి దగ్గరగా 50 సినిమాలు చేశాం.  ప్రాణం ఖరీదు, బాబాయి అబ్బాయి, అలీబాబా అరడజను దొంగలు, ఏవండీ ఆవిడ వచ్చింది, హై హై నాయక, చిన్నబ్బాయి, 420, కత్తి కాంతారావు తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఏరా ఏరా అనుకునేంత స్నేహం ఉంది. రాజమండ్రిలో నా ఆర్కెస్ట్రా 25వ వార్షికోత్సవానికి కోటశ్రీనివాసరావు హాజరై  స్టేజ్‌పై మిమిక్రీ చేశాడు. చాలా గొప్ప కళాకారుడు, విలక్షణ నటుడు, మంచి వ్యక్తి. ఆయన చనిపోవటం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయనకు సద్గతులు కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ఆయన పేర్కొన్నారు.



అన్నపూర్ణ టాకీస్‌ను సందర్శించిన ‘కోట’
అమలాపురం రూరల్‌: అప్పట్లో కోట శ్రీనివాసరావు అమలాపురం  మండలం సమనసలోని స్టేట్‌బ్యాంకుకు విచ్చేశారు. ఆయన  సినిమాల్లోకి రాకముందు బ్యాంకు ఉద్యోగిగా పనిచేశారు. ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో అమలాపురం  మండలం సమనసలోని స్టేట్‌ బ్యాంకుకు విచ్చేశారు. అక్కడ బ్యాంకు మేనేజర్‌ను కలిసిన సందర్భంగా అప్పటి సర్పంచ్‌ మామిళ్లపల్లి రాజారావును కలుసుకుని ఆయన నడుపుతున్న అన్నపూర్ణ టాకీస్‌ను సందర్శించారు. అన్నపూర్ణ టాకీస్‌ వద్ద కోటను సర్పంచ్‌ రాజారావు ఆధ్వర్యంలో సత్కరించారు. అప్పట్లో కోట శ్రీనివాసరావు ను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. 1987 లో ఈ ఘటన చోటుచేసుకోగా ఆ సమయంలో అన్నపూర్ణ టాకీస్‌లో ప్రతిఘటన సినిమా ఆడుతోంది. కోట శ్రీనివాసరావు ఆదివారం మృతి చెందడంతో ఆయనతో ఉన్న అనుబంధాన్ని మాజీ సర్పంచ్‌ మామిళ్లపల్లి రాజారావు గుర్తు చేసుకుని ఆయన మృతికి సంతాపం తెలిపారు. 



భలే ఖైదీలు షూటింగ్‌లో కోటతో  శ్రీరామ వరప్రసాద్‌  
రాంకీ నిరోషా హీరో హీరోయిన్లుగా బీవీఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భలే ఖైదీలు సినిమా షూటింగ్‌ 1992లో కాకినాడలో జరిగింది. ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో కీలక సన్నివేశాలను కాకినాడలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో ప్రైవేట్‌ బస్సు కండక్టర్‌గా అమలాపురం మండలం  సవరప్పాలెం గ్రామానికి చెందిన సత్తి శ్రీరామవరప్రసాద్‌ నటించారు. కోట శ్రీనివాసరావు, సత్యనారాయణతో కలిసి నటించిన సన్నివేశాలు ఇప్పటికీ మర్చిపోలేనని శ్రీరామ వర ప్రసాద్‌ తెలిపారు.

‘కోట’కు చిత్ర నీరాజనం
కాట్రేనికోన: ప్రముఖ చలన చిత్ర నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట శ్రీనివాసరావు శివైక్యం చెందడంతో కాట్రేనికోనకు చెందిన చిత్రకారుడు ఆకొండి అంజి, సినీ నటుడు పెద్దింటి సురేష్‌ సంతాపం తెలిపారు. ఉభయ తెలుగు రాష్టాలతోపాటు, తమిళ, కన్నడ భాషలలో సమారు 700లకు పైబడి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన కోట శ్రీనివాసరావు మృతి చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు. ఆయన మృతికి సంతాపంగా  చిత్రకారుడు ఆకొండి అంజి చిత్ర నీరాజనం తెలుపుతూ కోట శ్రీనివాసరావు చిత్రాన్ని గీశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement