నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం అదే: సోనూసూద్‌

Sonu Sood Emotional Post Road in Hometown Named After His Mother - Sakshi

ముంబై: ‘‘నేను కలగన్న, నా జీవితాశయం నేడు నెరవేరింది. మా స్వస్థలం మోగాలో మా అమ్మ పేరిట.. ‘‘ప్రొఫెసర్‌. సరోజ్‌ సూద్‌ రోడ్‌’’గా రహదారికి నామకరణం చేశారు. నా జీవితంలో ఇదొక ముఖ్యమైన అధ్యాయం. అమ్మ ఏ రోడ్డు గుండా తన జీవితకాలం ప్రయాణం చేసిందో ఇప్పుడు అదే రహదారికి ఆమె పేరు పెట్టారు. ఆ మార్గం గుండానే తను కాలేజి నుంచి ఇంటికి, ఇంటి నుంచి కాలేజీకి వెళ్లేవారు. స్వర్గంలో ఉన్న నా తల్లిదండ్రులు ఈ విషయం తెలిసి కచ్చితంగా సంతోషిస్తారు. ఈ విషయాన్ని సుసాధ్యం చేసిన హర్జోట్‌ కమల్‌, సందీప్‌ హాన్స్‌, అనితా దర్శి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు నేను గర్వంగా చెప్పగలను. ఈ ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం..‘‘ప్రొఫెసర్‌ సరోజ్‌ సూద్‌ రోడ్‌.. నా విజయానికి మార్గం’’అంటూ రియల్‌ ‘హీరో’ సోనూసూద్‌ ఉద్వేగానికి లోనయ్యారు. పంజాబ్‌లోని తమ స్వస్థలంలో ఓ రహదారికి తన తల్లి పేరు పెట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. (చదవండి: సోనూసూద్‌ వల్లే నేడు ఈ స్థాయిలో..)

కాగా కరోనా లాక్‌డౌన్‌ కాలంలో సేవా కార్యక్రమాలు ప్రారంభించిన సోనూసూద్‌ నేటికీ వాటిని కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంతరాష్ట్రాలకు చేర్చడంతో మొదలై.. కష్టం వచ్చిందంటే చాలు ‘‘మనకు సోనూ ఉన్నాడు’’ అనే ధీమా కలిగిస్తూ అపర కర్ణుడిగా నీరాజనాలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఐక్యరాజ్యసమితి హ్యుమానిటేరియన్‌ అవార్డు వంటి ఎన్నెన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు ఆయనను వరించాయి. వాటన్నింటికీ మించి ప్రజల గుండెల్లో దేవుడిగా సోనూసూద్‌ స్థానం సంపాదించుకున్నారు. ఇక తన సేవాగుణానికి తల్లి సరోజ్‌ సూద్‌ పెంపకమే కారణమని ఇప్పటికే పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top