
కోలీవుడ్ భామ శృతిహాసన్ ఇటీవలే కూలీ మూవీతో ప్రేక్షకులను అలరించింది. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో ప్రీతి అనే పాత్రలో శృతిహాసన్ నటించింది. ఈ మూవీలో టాలీవడ్ హీరో నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ సైతం కీలక పాత్రల్లో మెప్పించారు.
అయితే తాజాగా ఓ నెటిజన్ శృతి హాసన్ పాత్రపై ఆమెను ప్రశ్నించాడు. ఆస్క్ మీ సమ్థింగ్ అంటూ శృతిహాసన్ సోషల్ మీడియాలో చాట్ నిర్వహించింది. ఇది చూసిన ఓ నెటిజన్.. ఆపదలో ఉన్న అమ్మాయిగా ప్రీతి పాత్రను అలా చిత్రీకరించడం మీకు అన్యాయంగా అనిపించలేదా? అని అడిగాడు. దీనికి శృతిహాసన్ కూడా రిప్లై ఇచ్చారు.
ఇక్కడ ఆమె బాధలో ఉంది.. కానీ అది మరొకరి విజన్.. ఇక్కడ మీరు చూడాల్సింది న్యాయమా? అన్యాయమా కాదు?.. ఆ పాత్రను మాత్రమే అంటూ సమాధానమిచ్చింది. ఇదంతా దర్శకుడి దృష్టి కోణానికి సంబంధించినది అని అన్నారు. గత ఇంటర్వ్యూలో ప్రీతి పాత్ర గురించి శృతిహాసన్ మాట్లాడింది. తన పాత్ర చాలా భిన్నంగా ఉండడంతో పాటు లోతుగా సంబంధం కలిగి ఉందని అభివర్ణించింది. ప్రీతి పాత్ర మహిళలందరికీ నచ్చుతుందని.. ఆ పాత్ర గురించి నాకు నిజంగా నచ్చింది అదేనని తెలిపింది. ఆమె పాత్రలోని కొన్ని అంశాలతో తాను కనెక్ట్ అయ్యానని వెల్లడించింది. ప్రీతి చాలా బాధ్యతాయుతంగా, చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని పేర్కొంది.

కాగా.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.