స్కూళ్లో శృతి హాసన్‌ పేరేంటో తెలుసా?

Shruti Haasan: Interesting Unknown Facts About Her - Sakshi

దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది శృతి హాసన్‌. కథ నచ్చితే చాలు సినిమా చిన్నదా? పెద్దదా? అని చూడకుండా చేసుకుంటూ పోతుంది. కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలో ప్రేమలో పడి ఒడిదొడుకులకు లోనైన ఆమె బ్రేకప్‌ తర్వాత కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఫలితంగా 'కాటమరాయుడు' విడుదలైన మూడేళ్ల తర్వాత 'క్రాక్'‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఒక్కసారి నటించడం మొదలు పెడితే తనతో ఎవరూ పోటీకి రాలేరు అన్నట్లుగా మాస్ యాంగిల్‌ చూపిస్తూ జనాలతో ఈలలు వేయించింది.‌ నేడు(గురువారం) ఈ చెన్నై సుందరి 35వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె సినీ, వ్యక్తిగత కెరీర్‌ గురించి ఓసారి చూసేద్దాం..

సైకాలజిస్టు శృతి..
కమల్‌ హాసన్‌-సారికల తొలి సంతానమే శృతి హాసన్‌. ఈమెకు అక్షర హాసన్‌ అనే చెల్లెలు కూడా ఉంది. తనను అందరూ స్టార్‌ కిడ్‌గా ట్రీట్‌ చేయడం ఇష్టం లేని శృతి స్కూలులో ఆమె పేరును పూజా రామచంద్రంగా చెప్పుకునేది. అలా ఆమె స్నేహితులను బురిడీ కొట్టించింది. టాలెంటెడ్‌ నటిగా అందరికీ సుపరిచితురాలైన శృతి ఎనిమిది భాషలు అనర్గళంగా మాట్లాడగలదు. పైగా ఈమె ఓ సైకాలజీ స్టూడెంట్‌. కానీ సినిమాల మీద ఆసక్తితో చదువుకు స్వస్తి పలికింది. హే రామ్‌ సినిమాలో తొలిసారి బాలనటిగా కనిపించింది శృతి. (చదవండి:  ప్రభాస్ కొత్త రికార్డు.. అత్యంత వేగంగా ఆ మైల్‌స్టోన్..)

గబ్బర్‌సింగ్‌తో బ్రేక్‌..
తర్వాత 2010లో ఇమ్రాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన 'లక్'‌ సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో కెరీర్‌ మొదట్లోనే ఫ్లాప్‌ హీరోయిన్‌గా ముద్ర పడింది. అయినా సరే ఆమె నిరాశ చెందకుండా సినిమాలు చేసుకుంటూ పోయింది. తన మీద పడ్డ మచ్చను చెరిపేసుకునేందుకు ఎంతగానో కష్టపడింది. ఈ క్రమంలో తెలుగులో నటించిన 'గబ్బర్‌ సింగ్'‌ ఆమెను స్టార్‌ హీరోయిన్‌గా నిలబెట్టింది. తర్వాత చేసిన రేసుగుర్రం, శ్రీమంతుడు బ్లాక్‌బస్టర్‌హిట్‌ కావడంతో పాటు శృతికి తిరుగులేదు అన్న టాక్‌ వినిపించింది. 

మ్యూజిక్‌ కంపోజ్‌, సింగింగ్‌, యాక్టింగ్‌..
తన సినిమాల్లో బోలెడన్ని పాటలు పాడిందీ హీరోయిన్‌. అంతేకాదు పాటలు రాసి, కంపోజ్‌ చేసే నైపుణ్యం కూడా ఆమె దగ్గర ఉంది. ఏడేళ్ల వయసు నుంచే ఆమె మ్యూజిక్‌ నేర్చుకుందని స్వయంగా కమల్‌ హాసనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బాలీవుడ్‌లో అర్జున్‌ కపూర్‌, సోనాక్షి సిన్హా జంటగా నటించిన 'తేవార్'‌లో జోగానియా పాటను ఆలపించింది. తెలుగులో తన తండ్రి 'ఈనాడు' సినిమాకు ప్రచార గీతంలో గళం విప్పిన ఆమె తరువాత ఓ మై ఫ్రెండ్‌, త్రీ, రేసుగుర్రం, ఆగడు చిత్రాల్లో పాడి ఆకట్టుకుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఈ భామ 'ఓ మై ఫ్రెండ్'‌ కోసం ప్రత్యేకంగా కూచిపూడి నేర్చుకుంది. ఆ మధ్య ముక్కుకు సర్జరీ కూడా చేయించుకుంది. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం సలార్‌తో పాటు వకీల్‌సాబ్‌లో నటిస్తోంది.

ప్రేమలో విఫలం..
ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్‌ పలికించే సెలబ్రిటీలు ఆఫ్‌ స్క్రీన్ మీద కూడా సులువుగా ప్రేమలో పడిపోతుంటారు, అంతే సులువుగా బ్రేకప్‌ చెప్పేస్తుంటారు. 2016లో లండన్‌ నటుడు మైఖేల్‌ కర్సెల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన శృతి ఆ బంధాన్ని పెళ్లివరకూ తీసుకురాలేకపోయింది. 2019లో వీరి దారులు వేరని తెలుసుకుని స్నేహితుల్లా ఉందామంటూ బ్రేకప్‌ చెప్పుకున్నారు. అయితే మాజీ ప్రేమికుడిని ఎన్నటికీ అసహ్యించుకోనని చెప్తోంది శృతి. పోనీ ఇప్పుడు ఎవరితోనైనా లవ్‌లో ఉన్నారా అంటే బహుశా, అవునేమో అంటూ చమత్కారంగా సమాధానమిచ్చి అభిమానులను గందరగోళంలో పడేసింది. కానీ ఈ ఏడాది పెళ్లైతే చేసుకోవడం లేదని తేల్చి చెప్పింది. దీనికన్నా ముందు తమిళ హీరో ధనుష్‌తో ప్రేమాయణం జరిపిందన్న వార్తలు కూడా వినిపించాయి. (చదవండి: మాజీ ప్రియుడు, పెళ్లిపై స్పందించిన హీరోయిన్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top