నేను అలాంటి పనులు చేయను ! | Sakshi
Sakshi News home page

నేను అలాంటి పనులు చేయను !

Published Mon, Jan 29 2024 12:32 AM

shraddha das reacted to the fight with mannara chopra the post is going viral - Sakshi

‘అల్లరి’ నరేశ్‌ హీరోగా నటీంచిన ‘సిద్ధు ఫ్రమ్‌ సీకాకుళం’(2008) సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు శ్రద్ధాదాస్‌. ఆ తర్వాత హిందీ, కన్నడ, మలయాళం, బెంగాళీ భాషల్లో పలు సినిమాల్లో నటించి గ్లామర్‌ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. ఆ మధ్య హీరోయిన్‌ మన్నారా చోప్రా గురించి శ్రద్ధాదాస్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు తెరలేపాయి. ‘‘జిద్‌’ (2014) అనే హిందీ సినిమాలో మన్నారా చోప్రాతో కలిసి నటించాను.

ఈ సినిమా చిత్రీకరణలో కొన్ని సన్నివేశాల్లో మన్నారా చోప్రా కావాలనే నన్ను నిజంగానే కొట్టింది.. బలవంతంగా మెట్లపైకి తోసేసింది.. ఆమె వల్ల గాయాలపాలయ్యాను’’ అంటూ గతంలో మాట్లాడారు శ్రద్ధాదాస్‌. ఆ మాటలపై తీవ్ర దుమారం రేగినా, ఆ తర్వాత సద్దుమణిగింది. అయితే మన్నారా చోప్రాతో ఉన్న విభేదాలపై శ్రద్ధాదాస్‌ మరోసారి స్పందించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

దీనిపై తన సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు శ్రద్ధాదాస్‌. ‘‘మన్నారా చోప్రాపై కానీ, ఆమె ఫ్యామిలీ గురించి నేను ఏ మీడియాకి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కనీసం నా వ్యక్తిగత పీఆర్వో సిబ్బంది కూడా లేరు. నేను కావాలనుకుంటే ‘ఎక్స్‌’ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్‌ చేసి పబ్లిసిటీ పొందుతాను. కానీ, నేను అలాంటి పనులు చేయను. ఆమె విషయంలో గతంలో నేను బాధపడ్డాను. కానీ, ఇప్పుడు వీటన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను’’ అంటూ శ్రద్ధాదాస్‌ పెట్టిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement
 
Advertisement