Shiva Shankar Master: వెన్నుముక గాయంతో 8 ఏళ్లు మంచానికే, డ్యాన్స్‌ మాస్టర్‌ ఎలా అయ్యారంటే..

Shiva Shankar Master First Choreography Movie Is Kuruvi Koodu Movie - Sakshi

ఏడాది వయసులోనే వెన్నుముకకు తీవ్ర గాయం

నడవలేని స్థితిలో శివ శంకర్‌ మాస్టర్‌ 

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్‌ కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం(నవంబర్‌ 28) ఆయన తుదిశ్వాస విడిచారు. 1948 డిసెంబర్ 7న చెన్నైలో జన్మించిన మాస్టర్‌ సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించారు. ఏడాది వయసులోనే ఓ ప్రమాదంలో తన వెన్నుముక  దెబ్బతినడంతో 8 ఏళ్లు మంచానికే పరిమితమైన ఆయన డ్యాన్స్‌ మాస్టర్‌గా ఎలా మారారో తెలుసుకుందాం.ఏడాది వయసులోనే వెన్నుముకకు గాయం కావడంతో ఏనిమిదేళ్లు మాస్టర్‌ మంచానికి పరిమితయ్యారు. దీంతో ఆయన తండ్రి మాస్టర్‌కు ట్యూషన్‌ పెట్టించారు. ఇక మాస్టర్‌ నేరుగా అయిదో తరగతిలో చేరారు.

కానీ వెన్నెముక గాయం కారణంగా ఇతర పిల్లలతో ఆడుకోవటానికి అవకాశం ఉండేది కాదు. దీంతో ఇంట్లో చాలా గారాబంగా పెంచారు. అప్పట్లో ‘సభ’ అని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థ ఉండేది. అందులో శివశంకర్‌ తండ్రి సభ్యుడు. ఆయనకు పాటలంటే ప్రాణం. నాటకాలు, డ్యాన్సులు చూడాలంటే డ్రైవర్‌ను ఇచ్చి శివ శంకర్‌ను పంపేవారు. వాటిని చూసి చూసి వాటిపై శివ శంకర్‌ మాస్టర్‌కు ఆసక్తి నెలకొంది. ఎలాగైనా డ్యాన్స్‌ నేర్చుకోవాలనే పట్టుదల ఆయనలో పెరిగిపోయింది.దాంతో తనంతట తానే డ్యాన్స్‌ నేర్చుకుని, 16 ఏళ్లు వచ్చేసరికి ట్రూప్‌ల వెంట వెళ్లి డ్యాన్సు చేయడం మొదలు పెట్టారు. అలా 1974లో డ్యాన్స్‌ మాస్టర్‌ సలీమ్‌ వద్ద అసిస్టెంట్‌గా చేరారు శివశంకర్‌.

అప్పటికి సలీమ్‌ మాస్టర్‌ సినిమా పరిశ్రమలో పేరున్న కొరియోగ్రాఫర్‌. ఆరేళ్ల పాటు అసిస్టెంట్‌గా చేసి... ‘కురువి కూడు’ (1980) అనే తమిళ చిత్రం ద్వారా నృత్య దర్శకుడిగా మారారు శివ శంకర్‌. అక్కడి నుంచి వరుసగా ‘సాటై్ట ఇల్లాద పంబరం’, ‘మన్‌ వాసనై’, ‘ఎన్‌ ఆసై మచ్చాన్‌’, ‘పూవే ఉనక్కాగ’ తదితర తమిళ చిత్రాలకు చేశారు. అప్పటికి శివ శంకర్‌ మాస్టర్‌ హవా మొదలైంది. శివ శంకర్‌ స్టెప్పులను తమిళ ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్న తరుణంలో తెలుగు పరిశ్రమ దృష్టి కూడా ఆయనపై పడింది. ‘ఖైదీ’లో చిరంజీవి, మాధవిలతో ‘రగులుతోంది మొగలి పొద..’ అంటూ శివ శంకర్‌ మాస్టర్‌ చేయించిన డ్యాన్స్‌ సూపర్‌ హిట్‌. ‘అమ్మోరు’ (1995), ‘దొంగ దొంగది’ (2003), ‘అల్లరి పిడుగు’ (2005).. ఇలా వరుసగా తెలుగులోనూ సినిమాలు చేస్తూ బిజీ కొరియోగ్రాఫర్‌ అయిపోయారు.

‘దొంగ దొంగది’లో మనోజ్, సదాతో ‘మన్మథ రాజా మన్మథ రాజా..’ పాటకు శివ శంకర్‌ మాస్టర్‌ మంచి మాస్‌ స్టెప్స్‌.. అది కూడా స్పీడ్‌ స్టెప్స్‌ వేయించారు. అలాగే ‘అరుంధతి’ (2009)లో క్షుద్ర మాంత్రికుడు సోనూ సూద్‌ని అంతం చేయడానికి అనుష్కతో ‘భు భు భుజంగం.. ది ది తరంగం....’ అంటూ డ్రమ్స్‌ డ్యాన్స్‌ చేయించిన తీరు అద్భుతం. ఇందుకు పూర్తి భిన్నంగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’ (2009)లో రామ్‌చరణ్, కాజల్‌ అగర్వాల్‌తో ‘ధీర ధీర ధీర మనసాగలేదురా..’లో స్టయిలిష్‌ రొమాంటిక్‌ స్టెప్ట్స్‌ వేయించారు. ఈ స్టెప్సే ఆయనకు ఉత్తమ నృత్యదర్శకుడిగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టాయి. తెలుగు, తమిళంలోనే కాదు.. దక్షిణాదిన పలు భాషల్లో కొరియోగ్రాఫర్‌గా చేసిన రికార్డ్‌ శివ శంకర్‌ది. పది భాషల్లో సుమారు 800 చిత్రాల్లో 15వేలకు పైగా పాటలకు నృత్యదర్శకుడిగా చేశారు. 

నటుడిగానూ...శింబు, త్రిష నటించిన ‘అలై’ సినిమాలో డ్యాన్స్‌ మాస్టర్‌ క్యారెక్టర్‌తో నటుడిగా కెరీర్‌ను ఆరంభించారు ఆయన. ఆ తర్వాత అజిత్‌ హీరోగా నటించిన ‘వరలారు’లో అజిత్‌కు డ్యాన్స్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా శివ శంకర్‌ నటించారు. బాల దర్శకత్వంలో వచ్చిన ‘పరదేశి’లో ఓ కీలక పాత్ర చేశారు. ఇక తెలుగులో ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘అక్షర’, ‘ఎన్టీఆర్‌: కథానాయకుడు’, ‘నీను వీడని నీడను నేనే’, ‘రాజుగారి గది 3’ చిత్రాల్లో తనదైన శైలి నటనతో మాస్టర్‌ మెప్పించారు. ఇతర భాషా చిత్రాలోన్లూ నటించారాయన. బుల్లితెరపై కూడా ఇటు యాక్టింగ్‌లోనూ, అటు డ్యాన్స్‌ షోలకు న్యాయనిర్ణేతగాను సత్తా చాటారు. తెలుగులో ‘నాగభైరవి’, ‘నెంబర్‌ 1 కోడలు’ సీరియల్స్‌తో పాటు తమిళ సీరియల్‌ ‘జ్యోతి’లోనూ నటించారు. శివ శంకర్‌ మాస్టర్‌కు భార్య సుకన్య, ఇద్దరు కుమారులు (విజయ్, అజయ్‌) ఉన్నారు. కుమారులిద్దరూ కొరియోగ్రాఫర్లుగా చేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top