Jyothi Reddy: గోల్డ్‌ మెడలిస్ట్‌.. పెద్ద పెద్ద డైరెక్టర్ల పీఏలు నటి ఇంటి ముందు క్యూ కట్టేవారు!

Serial Actress Jyothi Reddy About Her Personal Life - Sakshi

బుల్లితెరపై 30 ఏళ్లకు పైగా రాణిస్తున్న గొప్ప నటీమణి జ్యోతి రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన భవనం వెంకట్రామిరెడ్డి మనవరాలే జ్యోతి. తొమ్మిదవ ఏటనే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె ఇప్పటికీ నటిగా రాణిస్తుండటం విశేషం. ఎక్కువగా నెగెటివ్‌ పాత్రలతోనే ప్రేక్షకులకు దగ్గరైన ఆమెకు తన ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం. కుటుంబానికి ఎంతో విలువిచ్చే ఆమె అమ్మానాన్న, భర్త, పిల్లల గుర్తుగా చేతినిండా పచ్చబొట్లు వేయించుకుంది. తాజాగా జ్యోతి రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

'నేను ఏపీ మాజీ సీఎం భవనం వెంకట్రామిరెడ్డి మనవరాలిని. చదువులో నేను ముందుడేదాన్ని. డిగ్రీ, ఎంఏ, ఎంఫిల్‌.. వరుసగా మూడుసార్లు గోల్డ్‌ మెడల్‌ సంపాదించాను. నాకు ఉద్యోగం చేయాలని ఉండేది. కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లు తమ ప్రాజెక్టుల్లో నటించమని వారి పీఏలను మా ఇంటికి పంపించేవారు. అది చూసి మా అమ్మ అంత గొప్పవాళ్లు నటించమని అడిగితే వద్దంటావేంటని బ్రెయిన్‌వాష్‌ చేసింది. తన వల్లే యాక్టింగ్‌ ఫీల్డ్‌లోకి వచ్చాను. ఇప్పటికీ కొనసాగుతున్నాను. షూటింగ్‌ లొకేషన్‌లో ఉన్నంతవరకు అందరూ మంచి ఫ్రెండ్సే. కానీ ఇంటికెళ్లిపోయాక ఎవరితోనూ టచ్‌లో ఉండను.

ఓ సంఘటన నాకు బాగా గుర్తుంది. అప్పుడు నాకు మూడేళ్లుంటాయి. ఇంటి గడప మీద కూర్చుని పడుకున్నాను. అమ్మ బిందెడు నీళ్లు నా మీద గుమ్మరించింది. అప్పటినుంచి అమ్మ పిలవకముందే నిద్ర లేచేదాన్ని. కాలేజీకి లేట్‌ అవుతుంది, షూటింగ్‌కు లేటవుతుంది.. అని ఏనాడూ అమ్మతో అనిపించుకోలేదు. అంత క్రమశిక్షణగా ఉంటాను. నా భర్త సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. నాకు ఇద్దరబ్బాయిలు. వాళ్లను అమ్మ చూసుకుంటుంది' అని చెప్పుకొచ్చింది జ్యోతి రెడ్డి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top