
దేశభక్తి ప్రధానంగా ఉండే సినిమాలు కొన్ని ఇదివరకే తెరపై సందడి చేశాయి. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ కూడా దక్కించుకున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి తెలంగాణకు చెందిన అమర జవాన్ బయోపిక్ కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోగా సల్మాన్ ఖాన్ నటిస్తాడని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇంతకీ ఎవరా జవాన్? ఏంటి సంగతి?
తెలంగాణ సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ సంతోష్ బాబు.. 2020లో గల్వాన్ లోయలో చైనాతో జరిగిన యుద్ధంలో వీరమరణం చెందారు. అప్పట్లో ఈయన ధైర్య సాహసాల గురించి మన ప్రజలు చాలా మాట్లాడుకున్నారు. అనంతరం ఈయన జీవితంలోని కొన్ని అంశాల ఆధారంగా 'ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్ 3' అనే నవల కూడా రాశారు.
(ఇదీ చదవండి: నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం)
ఇప్పుడు ఈ నవల ఆధారంగానే సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సల్మాన్ హీరోగా నటించనున్నారట. ఈ ఏడాది జూలైలో షూటింగ్ మొదలుకానుండగా.. ముంబై, లద్దాఖ్ లో దాదాపు 70 రోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరణ చేయనున్నారని సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.
గతంలో హీరోస్, టైగర్ జిందా హై, ఏక్ థా టైగర్ తదితర దేశభక్తి ప్రధానంగా నడిచే సినిమాల్లో సల్మాన్ నటించాడు. కాకపోతే గత కొన్నాళ్లుగా ఇతడు మూవీస్ అయితే చేస్తున్నాడు గానీ హిట్ పడట్లేదు. గతేడాది 'సికిందర్' చిత్రంతో వచ్చి ఘోరమైన ఫలితం అందుకున్నాడు. మరి ఈసారి జవాన్ బయోపిక్ మూవీతో సల్మాన్ ఏం చేస్తారో చూడాలి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)