
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై (Saif Ali Khan) ఈ ఏడాది ప్రారంభంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను(30) అరెస్ట్ చేశారు. ఇప్పటికే అతనిపై కోర్టులో చార్జ్‌షీట్‌ను కూడా దాఖలు చేశారు. అయితే, తన అరెస్ట్ చట్టవిరుద్ధమని ప్రకటించాలని, తనను జైలు నుంచి వడుదల చేయాలని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును నిందితుడు ఆశ్రయించాడు. ఆపై ఏప్రిల్ నెలలో సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కూడా అతను ఉపసంహరించుకున్నాడు.
ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న నిందితుడు మొహమ్మద్ తన న్యాయవాది అజయ్ గావ్లి ద్వారా, తన అరెస్టును చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (బాంద్రా) ముందు దరఖాస్తు చేసుకున్నాడు. ఆపై తనను జైలు నుండి విడుదల చేయాలని కోరాడు. ఆ పిటిషన్‌లో, పోలీసులు తనను అరెస్టు చేసేటప్పుడు చట్ట నిబంధనలను పాటించలేదన్నాడు. వారిపై మరికొన్ని ఆరోపణలు చేశాడు. దీంతో వాటికి సమాధానం చెప్పాలని పోలీసులను కోర్టు కోరింది. విచారణను మే 13కి వాయిదా వేసింది.
జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. అతని మెడపై కత్తిపోట్లు కూడా పడ్డాయి. దీంతో ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స తీసుకున్న ఆయన సుమారు ఐదు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే అతడు సైఫ్ నివాసంలోకి వెళ్లాడని పోలీసులు గుర్తించారు.