
‘‘ప్రస్తుతం మన సినిమాల్లో స్వచ్ఛమైన ప్రేమను చూపించడం లేదు. మా ‘షష్టిపూర్తి’ చిత్రంలో కుటుంబ అంశాలతో పాటు అన్ని రకాల భావోద్వేగాలను చూపించాం. అలాగే అందమైన ప్రేమకథ కూడా ఉంది. ఇందులోని పాత్రల్ని చూస్తే తమని తాము చూసుకున్నట్టుగా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు’’ అని హీరో–నిర్మాత రూపేష్ తెలిపారు.
రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో, రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌పై రూపేష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రూపేష్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘షష్టిపూర్తి’ కథను రాజేంద్ర ప్రసాద్‌గారి కోసమే పవన్ ప్రభ రాసుకున్నారు. ఆయన కొడుకు పాత్ర కోసం నన్ను సంప్రదించారు. పవన్‌గారు చెప్పిన ఈ కథ బాగా నచ్చడంతో ఈ కథని రాజీ పడకుండా తీయాలనే ఆలోచనతో నేనే నిర్మించాను.
ఔట్‌పుట్ చూసుకున్నాక... కథ విన్నప్పుడు కంటే రెండింతల సంతృప్తి కలిగింది. పవన్‌గారు అంత బాగా తెరకెక్కించారు. మా చిత్రానికి ఇళయరాజా, తోట తరణివంటి పెద్ద సాంకేతిక నిపుణులు పని చేయడంతో బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువైంది. అయితే ఆ ఖర్చు అంతా తెరపై కనిపిస్తుంది. మా ఆయి ప్రొడక్షన్స్ అంటే మా అమ్మ ప్రొడక్షన్ అని అర్థం. నేను నటించిన తొలి చిత్రం ‘22’. అయితే ముందుగా ‘షష్టిపూర్తి’ విడుదలవుతోంది. ‘22’ని కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నాం. నా తర్వాతి సినిమాలకు రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి’’ అని చెప్పారు.