The Rose Villa Movie Review: ‘బిగ్‌బాస్‌’ఫేమ్‌ శ్వేత నటించిన ‘ది రోజ్‌ విల్లా’ ఎలా ఉందంటే..

The Rose Villa movie review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : ది రోజ్‌ విల్లా
నటీనటులు :  దీక్షిత్ శెట్టి, శ్వేతా వర్మ, రాజా రవీంద్ర, అర్చన తదితరులు
నిర్మాణ సంస్థ : చిత్ర మందిర్ స్టూడియోస్ 
నిర్మాత : అచ్యుత్ రామారావు
దర్శకత్వం :హేమంత్‌
సంగీతం :  సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ :  అంజి 
ఎడిటింగ్‌:  శివ
విడుదల తేది : అక్టోబర్‌ 1,2021

‘క‌న్న‌డ `దియా` ఫేమ్ దీక్షిత్ శెట్టి, బిగ్‌బాస్‌ -5 ఫేమ్‌ శ్వేతా వర్మ హీరో,హీరోయిన్‌గా న‌టించిన తాజా చిత్రం  ది రోజ్‌ విల్లా. చిత్ర మందిర్ స్టూడియోస్ బ్యానర్‌పై అచ్యుత్ రామారావు నిర్మించిన ఈ సినిమాకు హేమంత్‌ దర్శకత్వం వహించాడు. రాజా రవీంద్ర కీలకపాత్రలో నటించారు. అక్టోబ‌ర్ 1న ఈ మూవీ తెలుగు, కన్నడలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ
డాక్ట‌ర్ ర‌వి (దీక్షిత్ శెట్టి), శ్వేత (శ్వేత వ‌ర్మ) కొత్తగా పెళ్లి చేసుకున్న యువ జంట.  ఇద్దరూ తాము కోరుకున్న‌ విధంగా ఉండాలని.. మున్నార్ అనే అంద‌మైన ప్రాంతానికి కారులో బయలుదేరుతారు.  ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం సాగిస్తారు. అయితే వీరిద్దరు అనుకోకుండా నక్సల్స్‌ ఉన్న డేంజర్‌ పాయింట్‌కు వెళ్తారు. అక్కడ వారి కారు పాడైపోతుంది. ఎంతకీ స్టార్ట్‌ అవ్వదు. అలాంటి సమయంలో పోలీసులు వచ్చి వారిని సురక్షితంగా పక్క గ్రామంలో దిగబెడతారు.  అక్క‌డ రెస్టారెంట్‌లో వీళ్ళు తింటుండ‌గా మిల‌ట్రీ రిటైర్ అయిన సోల్‌మాన్ (రాజా ర‌వీంద్ర) త‌న భార్య హెలెన్‌తో (అర్చ‌నా కుమార్‌)తో అక్క‌డే ఉంటాడు. అతన్ని ఓ ప్రమాదం నుంచి డాక్టర్ రవి కాపాడతాడు. దీంతో వారిద్దరు స్నేహితులైపోతారు.  త‌న‌ను కాపాడినందుకు ఆ యువ జంటని ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తారు. అలా అక్కడికి వెళ్ళిన ఈ యువ‌జంట‌కు అక్క‌డి వాతావ‌ర‌ణం వితంగానే కాకుండా భ‌యం క‌లిగించేలా ఉంటుంది. అలా ఎందుకు అనిపించింది.. ఏం జరిగింది? అప్పుడు ఈ యువ‌జంట ఏం చేశారు? అనేది మిగిలిన క‌థ‌

ఎలా చేశారంటే..
డాక్ట‌ర్ ర‌వి పాత్రకు దీక్షిత్‌ పూర్తి న్యాయం చేశాడు. బిగ్ బాస్ 5 తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న శ్వేతా వర్మ ఇందులో హీరోయిన్.  ఈమె కూడా బాగానే నటించింది. తెరపై అందంగా కనిపించడంతో పాటు తనదైన నటనతో మెప్పించింది. రైటైర్‌ మిలట్రీ సోల్‌మాన్‌ పాత్రలో రాజా రవీంద్ర తన అనుభవాన్ని చూపించాడు.  అర్చనతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

విశ్లేషణ
ఓ సాధారణ కథకి భావోద్వేగాన్ని అతికించి తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు హేమంత్‌. దర్శకుడు తీసుకున్న పాయింట్‌ చిన్నదే అయినా.. దాని చుట్టు అల్లుకున్న సీన్స్‌  ప్రేక్షకుడిని థ్రిల్లింగ్‌ కలిగిస్తాయి. మాటలు కూడా బానే రాసుకున్నాడు. ఫస్టాఫ్ అంతా కాస్త నెమ్మదిగా సాగుతుంది. సెకండాఫ్ మాత్రం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా అర్చన, రాజా రవీంద్ర మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. అయితే కొన్ని సీన్స్‌ పునరావృతం కావడం ప్రేక్షకుడి బోర్‌ కొట్టిస్తాయి. హీరో హీరోయిన్లు రాజా రవీంద్ర ఇంటికి వచ్చిన తర్వాత వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగిస్తాయి. దీక్షిత్‌ను చూసి త‌న కొడుకు అనుకుని ఇక్క‌డే ఉండమని బ‌ల‌వంతం చేయ‌డంతో.. త‌ను అక్కడ్నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయడం.. ఆ తర్వాత ఏం జరిగిందనేది బాగానే అనిపిస్తుంది. సురేష్ బొబ్బిలి నేప‌థ్య బాగుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ, నేపథ్య సంగీతం మాత్రం సినిమా స్థాయిని పెంచేలా ఉంది.  అంజి సినిమాటోగ్రఫీ బాగుంది.  సన్నివేశాలను సహజంగా చిత్రీకరించారు. ఎడిటర్‌ శివ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

Rating:  
(2.5/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top