సహ జీవనం.. జూన్‌ 8 వరకు తనతోనే: రియా | Rhea Chakraborty To Court Was Living With Sushant Left On June 8 | Sakshi
Sakshi News home page

జూన్‌ 8 వరకు సుశాంత్‌తోనే ఉన్నా: రియా

Jul 31 2020 8:33 AM | Updated on Jul 31 2020 12:01 PM

Rhea Chakraborty To Court Was Living With Sushant Left On June 8 - Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ యువ హీరో బలవన్మరణానికి అతడి ప్రియురాలు రియా చక్రవర్తి ప్రవర్తనే కారణమంటూ బిహార్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. రియా తన కొడుకు నుంచి డబ్బులు లాక్కుని, మోసం చేసి వెళ్లిపోయిందని సుశాంత్‌ తండ్రి క్రిష్ణ కిషోర్‌ సింగ్‌ పట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బిహార్‌ పోలీసులు విచారణ ప్రారంభించగా.. రియా చక్రవర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తును బిహార్‌ నుంచి ముంబైకి బదిలీ చేయాలని బుధవారం పిటిషన్‌ దాఖలు చేశారు. (రియా చక్రవర్తిపై సంచలన ఆరోపణలు)

ఇందులో సుశాంత్‌తో తన బంధం, అతడి మరణం తర్వాత జరుగుతున్న పరిణామాల గురించి రియా పిటిషన్‌లో ప్రస్తావించిన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది కాలంగా తామిద్దరం సహజీవనం చేస్తున్నామని కోర్టుకు తెలిపిన ఆమె.. జూన్‌ 8న సుశాంత్‌ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయినట్లు తెలిపారు. డిప్రెషన్‌తో బాధ పడుతున్న సుశాంత్‌.. దానిని అధిగమించేందుకు మందులు వాడేవాడని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో జూన్‌ 14న బాంద్రాలోని తన నివాసంలో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అప్పటి నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియుడి మరణంతో కుంగిపోయిన తనను కొంత మంది అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని సుప్రీంకోర్టుకు తెలిపారు. (సుశాంత్‌ కేసు: పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు)

ఇందుకు సంబంధించి ముంబైలోని శాంతాక్రజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశానని చెప్పుకొచ్చారు. ఇప్పటికే సుశాంత్‌ ఆత్మహత్య కేసుకు ముంబై పోలీసులు తన వాంగ్మూలం నమోదు చేశారని, అయినప్పటికీ మరోసారి పట్నాలో కేసు నమోదు కావడం తనను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. సుశాంత్‌ తండ్రికి బిహార్‌లో తన పలుకుబడి ఉపయోగించి కేసును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున కేసును మంబైకి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా రియాతో బంధం కారణంగానే తన కొడుకు డిప్రెషన్‌లో మునిగిపోయాడని సుశాంత్‌ తండ్రి ఆరోపించిన విషయం తెలిసిందే. (రియాతో బంధం తెంచుకోవాలనుకున్నాడు: అంకిత)

ప్రేమ పేరుతో సుశాంత్‌ను తమకు దూరం చేసిందని, పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిన తర్వాత తనను ఒంటరిగా వదిలేసి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. రియా కూర్గ్‌లో సేంద్రీయ వ్యవసాయం చేయాలని భావించిందని, ఇందు​కు సహకరించకపోతే సుశాంత్‌ కెరీర్‌ను నాశనం చేస్తానని వేధింపులకు గురిచేసినట్లు తమకు తెలిసిందన్నారు. సుశాంత్‌తో మాట్లాడేందుకు తామెంతగా ప్రయత్నించిప్పటికీ రియా అడ్డుపడిందని, చివరికి ఆత్మహత్య చేసుకునేలా తనను ప్రేరేపించిందని ఆరోపించారు. ఇదిలా ఉండగా..  ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు బదిలీ చేయాలన్న పిటిషన్‌ను కొట్టి వేస్తూ సర్వోన్నత న్యాయస్థానం గురువారం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసును ప్రస్తుతం పోలీసులు విచారించవచ్చని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement