ఓటీటీలో సడెన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసిన రెండు సినిమాలు | RGV Saree And 23 Movies Now OTT Streaming | Sakshi
Sakshi News home page

ఓటీటీలో సడెన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసిన రెండు సినిమాలు

Jun 27 2025 12:32 PM | Updated on Jul 7 2025 5:51 PM

RGV Saree And 23 Movies Now OTT Streaming

నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ‘23’ (23 Movie) మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన చిలకలూరి పేట, చుండూరు, జూబ్లీహిల్స్‌ కార్‌ బాంబు పేలుడు సంఘటనల గురించి ఈ సినిమా ఉంటుంది. మే 16న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌లో ఓవర్సీస్‌ ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. అయితే, తాజాగా భారత్‌లోని యూజర్స్‌కు కూడా చూసేలా మేకర్స్‌ ఛాన్స్‌ కల్పించారు.

‘మల్లేశం’ (Mallesam) సినిమాతో  దర్శకుడిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్న  రాజ్‌.ఆర్‌ 23 మూవీని తెరకెక్కించారు. తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా నిర్మాణంలో స్టూడియో 99 సంస్థ ఈ మూవీని నిర్మించింది. అయితే, ఈ చిత్రం జూన్‌ 27 నుంచి సడెన్‌గా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. 

1991 సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జ‌రిగిన చుండూరు మారణకాండ ఘ‌ట‌న‌, 1993లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిలకలూరిపేటలో బస్సు దహనంతో పాటు.. 1997లో  హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లో జ‌రిగిన కార్ బాంబు దాడి గురించి 23 సినిమాతో  తెరపైకి తీసుకొచ్చారు. ఇలా ఈ మూడు ఘటనలలో మరణించిన వారి స్టోరీ ఒకే మాదిరి ముగియగా.. హంతకుల కథ చివరకు ఏమైంది అనే పాయింట్‌తో '23' చిత్రంలో చూపించారు. ఈ మూడు కేసుల్లో నేరం ఒక్కటే అయినప్పటికీ శిక్షల్లో ఎక్కువ తక్కువలు ఎందుకంటూ మన న్యాయ వ్యవస్థని ఈ చిత్రం ప్రశ్నిస్తుంది.

ఓటీటీలో ఆర్జీవీ  సైకలాజికల్ థ్రిల్లర్ 'శారీ' సినిమా
ఆర్జీవీ డెన్‌ నుంచి వచ్చిన కొత్త చిత్రం ‘శారీ’(Saaree Movie ) సుమారు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీకి రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ ఆర్జీవీ భాగస్వామ్యం అయ్యాడు. అతని శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించాడు.  ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. ఏప్రిల్‌ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం  ల‌య‌న్స్ గేట్ ప్లే (Lionsgate Play) ఓటీటీలో తెలుగు వర్షన్‌ స్ట్రీమింగ్‌ అవుతుంది. త్వరలో అమెజాన్‌ ప్రైమ్‌లో కూడా విడుదల కావచ్చని సమాచారం. ఆరాధ్య దేవి, సత్య యాదు జంటగా ఇందులో నటించారు.

కథేంటంటే..?
ఆరాధ్య దేవి( ఆరాధ్య దేవి) కి చీరలు అంటే చాలా ఇష్టం. కాలేజీ కి కూడా చీరలోనే వెళ్తుంది. చీరలోనే రీల్స్‌ చేసి ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంటుంది. ఒక సారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా...చీరలో ఉన్న ఆరాధ్య  నీ చూసి ఇష్టపడతాడు ఫోటోగ్రాఫర్ కిట్టు(సత్య యాదు). ఆమెను ఫాలో అవుతూ దొంగ చాటున ఫోటోలు తీస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌ లో చాట్ చేసి ఆమెను ఫోటో షూట్ కి ఒప్పిస్తాడు. అలా ఆమెకి దగ్గరవుతాడు. ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్ లానే చూస్తుంది. ఫోటో షూట్ టైమ్ లోనే ఆరాధ్య అన్నయ్య రాజు(సాహిల్‌ సంభ్యాల్‌)..కిట్టు తో గొడవ పడుతాడు. ఆ తరువాత ఆరాధ్య కిట్టు ను దూరం పెడుతుంది. కిట్టు మాత్రం ఆరాధ్య వెంట పడుతుంటాడు. సైకో లా మారి వేధిస్తుంటాడు. దీంతో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టు పై కేసు పెడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆరాధ్యను దక్కించుకునేందుకు సైకో కిట్టు ఏం చేశాడు? చివరకు కిట్టు పీడను ఆరాధ్య ఎలా వదిలించుకుంది అనేదే మిగతా కథ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement