నేను కూడా సిద్ధం | Sakshi
Sakshi News home page

నేను కూడా సిద్ధం

Published Mon, Feb 5 2024 12:42 AM

Ravi Teja Powerful Speech At EAGLE Pre Release Event - Sakshi

‘‘పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్‌ నాకు హోమ్‌ ప్రొడక్షన్‌ లాంటిది. విశ్వ ప్రసాద్, వివేక్‌గార్లతో పనిచేయడం సౌకర్యంగా ఉంటుంది.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు.. అన్ని విషయాల్లోనూ చాలా స్పష్టంగా ఉంటారు.. అందుకే వారితో పనిచేయడం నాకు ఇష్టం. నాతో మరిన్ని సినిమాలు చేయాలని ఉందని విశ్వ ప్రసాద్‌గారు అంటున్నారు.. ఈ బ్యానర్‌లో ఎన్ని సినిమాలు చేయడానికైనా నేను కూడా సిద్ధం’’ అని హీరో రవితేజ అన్నారు. ఆయన హీరోగా కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈగల్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో రవితేజ మాట్లాడుతూ–‘‘ఈగల్‌’ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకుల స్పందన చూసేందుకు నేను కూడా వేచి చూస్తున్నా. ఈ సినిమాకి తన సంగీతంతో ఇరగదీశాడు డేవ్‌ జాంద్‌. బాలనటుడు ధ్రువన్‌ పాత్ర  బాగుంటుంది.. పిల్లలందరూ తన పాత్రకి బాగా కనెక్ట్‌ అవుతారు. ‘ఈగల్‌’ కథని నడిపించేది అనుపమ పాత్రే. కావ్యది లవ్లీ క్యారెక్టర్‌. కార్తీక్‌ ఘట్టమనేని ఈ చిత్రాన్ని ఎంతో క్లారిటీతో తీశాడు. ఈ సినిమా విజయం సాధించి, తనకు చాలా మంచి పేరు రావాలి. నాకు నేను విపరీతంగా నచ్చిన పాత్ర ‘ఈగల్‌’.. ఈ పాత్ర కోసం చాలా మేకోవర్‌ అయ్యాను.

ఈ చిత్రం రిలీజ్‌ కోసం వేచి చూస్తున్నా’’ అన్నారు. కార్తీక్‌ ఘట్టమనేని మాట్లాడుతూ–‘‘ఈగల్‌’ కి దాదాపు 200 మంది సాంకేతిక నిపుణులు పనిచేశారు. ఇంతమందితో పనిచేసే అవకాశం నాకు ఇచ్చిన రవితేజ సర్‌కి థ్యాంక్స్‌. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి థియేటర్‌ అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు. ‘‘మా సంస్థలో వరుసగా మూడు సినిమాలు చేస్తున్న రవితేజగారికి థ్యాంక్స్‌. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుంది. ‘ఈగల్‌’ని అందరూ ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్‌. ‘‘మళ్లీ మళ్లీ రవితేజగారితో పనిచేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్‌. ‘‘రవితేజగారు వెర్సటైల్‌ యాక్టర్‌. ‘ఈగల్‌’ హాలీవుడ్‌ మూవీలా అద్భుతంగా ఉంటుంది. కానీ, తెలుగు నేటివిటీ ఎక్కడా మిస్‌ అవదు’’ అన్నారు చిత్ర సహ నిర్మాత వివేక్‌ కూచిభొట్ల.   
 

Advertisement
 
Advertisement