Ram Gopal Varma Shares Interesting Things About Enter The Girl Dragon Movie - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: అందుకే అమ్మాయి టైటిల్‌ పెట్టాం

Published Wed, Jul 13 2022 12:12 AM

Ram Gopal Varma talks about Enter The Girl Dragon - Sakshi

‘‘హాలీవుడ్‌ వాళ్లు తీసిన సినిమాలను మనం ఇక్కడ చూశాం. కానీ వాళ్లు ఎప్పుడూ పాన్‌ వరల్డ్‌ అని చెప్పుకోలేదు. ఇప్పుడు మూడు, నాలుగు సినిమాలు హిట్‌ అయితే మనం పాన్‌ ఇండియా అంటున్నాం. నార్త్, సౌత్‌ అని కాదు. సినిమా సినిమాయే. ఏడాదికి మనం వెయ్యి సినిమాలు తీస్తే అందులో ఫ్లాప్‌ అయిన పెద్ద సినిమాలు కూడా ఉంటున్నాయి’’ అన్నారు రామ్‌గోపాల్‌ వర్మ. పూజా భలేకర్‌ ప్రధాన పాత్రలో రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘లడ్కీ’ చిత్రం తెలుగులో ‘అమ్మాయి: డ్రాగన్‌ గర్ల్‌’ అనే టైటిల్‌తో ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ చెప్పిన విశేషాలు.

►‘ఎంటర్‌ ది డ్రాగన్‌’ సినిమాను 27 సార్లు చూశాను. దీంతో ‘బ్రూస్‌ లీ’ ప్రభావం నాపై పడింది.  మార్షల్‌ ఆర్ట్స్‌ అనగానే మనవాళ్లు డూప్‌లు, వీఎఫ్‌ఎక్స్‌లు వాడతారు. కానీ ‘అమ్మాయి’ చిత్రంలో అలాంటివి ఏవీ లేవు. పూజలాంటి ఓ మార్షల్‌ ఆర్ట్స్‌ అమ్మాయి ఏం చేయగలదో అదే సినిమాలో చేయించాను.

►ఒక  మార్షల్‌ ఆర్ట్స్‌ అమ్మాయికి బ్రూస్‌ లీ అంటే పిచ్చి. ఓ అబ్బాయికి ఈ అమ్మాయి అంటే ప్రేమ. బ్రూస్‌ లీ మీద ఆ అమ్మాయికి ఉన్న పిచ్చి అభిమానం ఆమెకే ప్రమాదం అని గ్రహించిన ఆ యువకుడు ఆమెను బ్రూస్‌ లీ మాయలో నుంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇది కథలోని ఒక భాగం.

►ఓ ఆరడుగుల అబ్బాయిని ఓ అమ్మాయి కొట్టిపడేసిందంటే అందరూ ఓ అమ్మాయి ఇలా చేసిందా? అని ఆశ్చర్యపోతారు. అమ్మాయి అంటే మగాడి మీద ఆధారపడుతూ, సిగ్గు పడుతూ ఉండాలి కదా అన్నట్లుగా కొందరు ఆలోచిస్తారు. కానీ అమ్మాయిలు కూడా ఏదైనా చేయగలరు అని చెప్పడానికే ఈ సినిమాకు ‘అమ్మాయి’ టైటిల్‌ పెట్టాం. 

►‘రిటర్న్‌ ఆఫ్‌ డ్రాగన్‌’ సినిమాను కాపీ కొట్టి ‘శివ’ సినిమా తీశాను. ఈ సినిమాలోని రెస్టారెంట్‌ ప్లేస్‌లో నేను కాలేజీ పెట్టి ‘శివ’ అనే సినిమా తీశాను. సేమ్‌ స్క్రీన్‌ ప్లే.

►నా తర్వాతి చిత్రంగా అల్‌ఖైదా ఉగ్రవాది మమ్మద్‌ ఆట్టా బయోపిక్‌ తీయనున్నాను.  

Advertisement
Advertisement