రకుల్‌-జాకీ పెళ్లి.. ఈ జోడీ కోసం స్పెషల్‌ ట్రాక్‌! | Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: డేటింగ్‌ నుంచి పెళ్లి.. రకుల్‌-జాకీలపై స్పెషల్‌ సాంగ్‌

Published Sat, Jan 27 2024 4:02 AM

Rakul Preet Singh and Jackky Bhagnani to have a customized song for their February wedding - Sakshi

బాలీవుడ్‌ హీరో–నిర్మాత జాకీ భగ్నానీ, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఇప్పుడు ఓ హాట్‌ టాపిక్‌. ఈ ఇద్దరూ భార్యాభర్తలుగా మారి, తమ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ఆరంభించాలనుకుంటున్నారనే వార్త వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 22న గోవాలో కుటుంబ సభ్యులు, బాగా దగ్గర స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఈ ఇద్దరి పెళ్లి జరగనుందని టాక్‌. కాగా.. పసందైన పాటలతో తమ పెళ్లిని ఆహ్లాదకరంగా జరుపుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారట జాకీ–రకుల్‌. వెడ్డింగ్‌ వీడియోగ్రాఫర్‌ విశాల్‌ పంజాబీని నియమించారట.

విరాట్‌ కోహ్లీ–అనుష్కా శర్మ, రణ్‌వీర్‌ సింగ్‌–దీపికా పదుకోన్, సిద్ధార్థ్‌ మల్హోత్రా–కియారా అద్వానీ వంటి స్టార్స్‌ వివాహ వేడుకలకు వీడియోగ్రాఫర్‌గా వ్యవహరించినది విశాల్‌ పంజాబీయే. వివాహ వేడుకల కోసం ప్రత్యేకంగా సౌండ్‌ ట్రాక్స్‌ చేస్తుంటారట విశాల్‌. ఇప్పటికే బాగా హిట్టయిన ప్రేమ పాటలను రీ–క్రియేట్‌ చేయడంతో పాటు కొత్త ట్యూన్లు కూడా చేస్తుంటారట. ఇంకా పెళ్లి కోసం ప్రత్యేకంగా పాటలు తయారు చేయడానికి, పాడటానికి సంగీతదర్శకులు విశాల్‌–శేఖర్, గాయనీమణులు యాషికా సిక్కా, హర్షదీప్ కౌర్ వంటి వారిని కూడా జాకీ–రకుల్‌ సంప్రదించారని భోగట్టా. తమ డేటింగ్‌ నుంచి పెళ్లి, భవిష్యత్తుని ప్రతిబింబించేలా విశాల్‌ పంజాబీతో ఓ ట్రాక్‌ తయారు చేయిస్తున్నారని సమాచారం. ఫిబ్రవరి మొదటి వారానికి ఈ ట్రాక్‌ రెడీ అవుతుందట. ఇలా ప్రత్యేకమైన, పసందైన పాటలతో తమ వివాహాన్ని ఓ కమ్మని పాటలా తీపి గుర్తులా ఉండేలా ఈ జోడీ ప్లాన్‌ చేసుకుంటోందని టాక్‌.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement