Raj Kundra Case: నాకు ఏ పాపం తెలియదు: నటి 

Raj Kundra Case: Actress Flora Saini Issues Clarification - Sakshi

వీడియో విడుదల చేసిన ఆశా షైనీ

ముంబై: ‘‘నేనొక నటిని. ప్రపంచంలో ఎక్కడో ఏ మూలనో కూర్చున్న వ్యక్తులు నా గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. మీరు ప్రచారం చేసే వదంతుల వల్ల నాకు వచ్చే అవకాశాలు చేజారతాయి. దయచేసి నన్ను వివాదాల్లోకి లాగకండి’’ అని నటి ఫ్లోరా షైనీ(ఆశా షైనీ) విజ్ఞప్తి చేసింది. రాజ్‌కుంద్రాతో గానీ, అతడి అనుచరులతో గానీ తనకు ఎటువంటి సంబంధం లేదని, తనకు ఏ పాపమూ తెలియదని స్పష్టం చేసింది. పోర్నోగ్రఫీ కేసులో ప్రముఖ బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్‌ కోసం అర్థించగా.. తిరస్కరించి కోర్టు అతడికి 14 రోజులపాటు జ్యూడిషియల్‌ కస్టడీ విధించింది.

ఈ నేపథ్యంలో రాజ్‌కుంద్రా సన్నిహితుడు ఉమేశ్‌ కామత్‌తో ఫ్లోరా షైనీకి స్నేహం ఉందని, వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంటూ శనివారం నాటి నుంచి ఓ వాట్సాప్‌ చాట్‌ స్థానిక మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ విషయంపై స్పందించిన ఫ్లోరా షైనీ.. ఇవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేసింది. ఈ మేరకు ఇన్‌స్టాలో వీడియో షేర్‌ చేసిన ఆమె... ‘‘ రాజ్‌కుంద్రా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ఆయన భార్య శిల్పాశెట్టి కూడా నటి. కాబట్టి ఆయనకు చాలా మంది నటీనటులతో స్నేహం ఉండే ఉంటుంది. కానీ, నాకైతే ఆయనతో గానీ, రూమర్లు ప్రచారం అవుతున్నట్లుగా ఉమేశ్‌ కామత్‌తో గానీ ఎలాంటి సంబంధం లేదు.

వారి కాంటాక్ట్‌ నంబర్లు కూడా నా వద్ద లేవు. అనవసరంగా నన్ను వివాదంలోకి లాగడం సరికాదు. నన్ను సంప్రదించకుండా, ఆ చాట్స్‌ నిజమైనవో కాదో తెలుసుకోకుండా ఇష్టారీతిన ప్రసారాలు చేస్తే ఆ చానెల్‌కు వచ్చే లాభమేమిటో అర్థం కావడం లేదు. నాపై చెడు ప్రచారం జరుగుతుంది కాబట్టే.. నేరుగా స్పందించాల్సి వచ్చింది’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు ఆమెకు అండగా నిలబడుతున్నారు.

కాగా నరసింహా నాయుడు, నువ్వు నాకు నచ్చావ్‌, ఆ ఇంట్లో, సర్దుకుపోదాం రండి తదితర తెలుగు చిత్రాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు చేరువైన ఆశా షైనీ.. కొంతకాలం సిల్వర్‌ స్క్రీన్‌కు దూరంగా ఉంది. ఆ తర్వాత తన పేరును ఫ్లోరా షైనీగా మార్చుకుని.. బాలీవుడ్‌కు వెళ్లింది. శ్రద్ధా కపూర్‌, రాజ్‌కుమార్‌ రావుల స్త్రీ బేగంజాన్‌, లక్ష్మీ తదితర సినిమాలతో పాటు గందీ బాత్‌ వెబ్‌సిరీస్‌లో నటించింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top