
డార్లింగ్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించనున్నారు. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైంది. కృష్ణంరాజు- ప్రభాస్ కాంబినేషన్ సీన్స్ తీస్తే కేవలం పది రోజుల్లోపే సినిమా పూర్తయిపోతుంది. ఈ చిత్రాన్ని జూలై 30న రిలీజ్ చేస్తామని ప్రకటించారు, కానీ కరోనా వల్ల విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశముంది.
ఇదిలా వుంటే రాధేశ్యామ్ కోసం ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్‌ను ఎర చూపుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని చేజిక్కించుకునేందుకు ఏకంగా రూ.400 కోట్లు ఆఫర్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కూడా రాధేశ్యామ్‌ను సొంతం చేసుకునేందుకు రూ.300 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైందంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో దానికంటే వంద కోట్లు ఎక్కువ మొత్తాన్ని కూడగట్టి మరీ అమెజాన్ ముందుకు రావడంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారట.
నిజానికి ఈ సినిమా బడ్జెటే సుమారు రూ.300 కోట్లుగా ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జనాలు థియేటర్లకు తరలి వస్తారన్న నమ్మకం పెద్దగా లేకపోవడంతో అమెజాన్ ఆఫర్‌ను అందిపుచ్చుకోవాలా? లేదా మరికొద్ది రోజులు వెయిట్ చేయాలా? అని మల్లగుల్లాలు పడుతున్నారట నిర్మాతలు. మరి నిజంగానే రాధేశ్యామ్ ఓటీటీలోకి వస్తుందా? లేదా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.