Pushpaka Vimanam Review: లేచిపోయిన భార్య కోసం సుందర్‌ పడిన కష్టాలేంటి?

Pushpaka Vimanam Movie Review - Sakshi

టైటిల్‌ : పుష్పక విమానం
నటీనటులు : ఆనంద్‌ దేవరకొండ, గీత్‌ సైనీ, శాన్వీ మేఘన, సునీల్‌, నరేశ్‌, హర్థవర్దన్‌ తదితరులు
నిర్మాణ సంస్థ : కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌, టాంగా ప్రొడక్షన్స్‌
నిర్మాతలు : గోవర్థన్‌ రావు దేవరకొండ, విజయ్‌ మిట్టపల్లి, ప్రదీప్‌ ఎర్రబెల్లి ని
దర్శకత్వం : దామోదర
సంగీతం : రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని 
సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్
విడుదల తేది : నవంబర్‌ 12, 2021

దొరసాని, మిడిల్‌ క్లాస్‌మెలోడీస్‌ లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ.ఇక ఇప్పుడు ఇక ‘పుష్ఫక విమానం’తో నటుడిగా ఆనంద్‌ మరో మెట్టు ఎక్కేందుకు సిద్ధమవుతున్నాడు. పెళ్ళైన కొద్దిరోజులకే తన భార్య మిస్సయిందనే ఆసక్తికర పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎంనో అంచనాల మధ్య ఈ శుక్రవారం (నవంబర్‌ 12)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్పక విమానం’మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. 


 

పుష్పక విమానం కథేటంటే..?

చిట్టిలంక సుందర్‌(ఆనంద్‌ దేవరకొండ) ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియని అమాయకపు చక్రవర్తి. అతనికి మీనాక్షి(గీత్‌ సైని)తో వివాహం జరుగుతుంది. అయితే పెళ్లైయిన కొద్ది రోజులకే మీనాక్షి వేరొకరితో పారిపోతుంది. ఊహించని ఈ విచిత్ర పరిస్థితిని సుందర్ ఎలా ఎదుర్కొంటాడు? అసలు మీనాక్షి ఎందుకు పారిపోయింది? భార్య పారిపోయిందనే విషయాన్ని సమాజానికి తెలియనీకుండా సుందర్‌ ఎలాంటి పనులకు ఒడిగట్టాడు? వాటి వల్ల సుందర్‌కు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి? వెబ్‌ సీరీస్‌, షార్ట్‌ఫిలిం హీరోయిన్‌ రేఖకు సుందర్‌కు మధ్య సంబంధం ఏంటి?  ఈ కథలోకి పోలీసాఫీసర్‌ రంగా(సునీల్‌) ఎలా ఎంట్రీ ఇచ్చాడు? చివరకు మీనాక్షి దొరికిందా లేదా? అనేదే ‘పుష్పక విమానం’ కథ

pushpaka-vimanam

ఎలా చేశారంటే.. 
ఆనంద్ దేవరకొండకు మూడో సినిమా ఇది. మొదటి రెండు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఆనంద్‌ నటన కాస్త మెరుగుపడింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిట్టిలంక సుందర్‌ పాత్రలో ఆనంద్‌ ఒదిగిపోయాడు. అమాయకపు చేష్టలతో అందరిని నవ్వించే ప్రయత్నం చేశాడు. భార్య పారిపోయిందనే విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని, దానికి కప్పిపుచ్చడానికి సుందర్‌ చేసే పనులు అందరిని నవ్విస్తాయి. అలాగే సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా ఆనంద్‌ అద్భుత నటనను కనబరిచాడు. ఇక మీనాక్షిగా గీత్‌ సైని మెప్పించింది. కథ మొత్తం తన పాత్ర చుట్టే తిరుగుతుంది. కానీ తెరపై ఆమె చాలా తక్కువ సమయమే కనిపిస్తుంది. అయినప్పటికీ ఉన్నంతతో తనదైన నటనతో ఆకట్టుకుంది.

ఇక సుందర్‌ నకిలీ భార్య రేఖ పాత్రలో శాన్వీ మేఘన ఒదిగిపోయింది. వెబ్‌సీరీస్‌, షార్ట్‌ ఫిల్మ్‌లు తీసే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రేఖ పాత్ర తనది. తెరపై మాస్‌ లుక్‌లో కనిపిస్తుంది.ఇక  పోలీసాఫీసర్‌ రంగగా సునీల్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సీరియస్‌ లుక్‌లో కనిపిస్తూనే తనదైన పంచ్‌లతో నవ్వించాడు. స్కూల్‌ హెడ్‌మాస్టర్‌గా నరేశ్‌తో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

pushpaka-vimanam-review

పుష్పక విమానం ఎలా ఉందంటే.. ?

పెళ్ళైన కొద్దిరోజులకే తన భార్య మిస్సయిందనే ఆసక్తికర పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు దామోదర. డైరెక్టర్‌ ఎంచుకున్న పాయింట్‌ కొత్తగా ఉన్నప్పటికీ.. తెరపై మాత్రం అంత ఆస్తక్తికరంగా చూపించలేకపోయాడు. ఫస్టాఫ్‌లో కథ పెద్దగా ఏమీ ఉండదు. భార్య మిస్సయిందనే పాయింట్‌ చుట్టూనే కథ తిరుగుతుంది. భార్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్స్ ఇస్తే పరువు పోతుందని..  తనే వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్స్‌ కడుపుబ్బా నవ్విస్తాయి. అదే సమయంలో కొన్ని సీన్స్‌ సాగదీతగా అనిపించి ప్రేక్షకుడి సహనానికి పరీక్షపెడతాయి. కానీ ఇంటర్వెల్‌ ముందు ఇచ్చే ట్విస్ట్‌ మాత్రం అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుకుంది. మీనాక్షిని ఎవరు హత్య చేశారనే విషయాన్ని చివరివరకు చెప్పకుండా, సెకండాఫ్‌లో కథను ఆసక్తికరంగా నడిపించాడు. అయితే పోలీసు విచారణ మాత్రం నాటకీయంగా సాగడం సినిమాకు మైనస్‌.

Anand-Devarakonda

దానికి తోడు కొన్ని సాగదీత సీన్స్‌ ప్రేక్షకుడికి బోర్‌ కొట్టిస్తాయి. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని సంగీతం బాగుంది. సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన ‘కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా.. వైభోగం’అనే సాంగ్‌  మినహా మిగతా పాటలన్ని అంతంత మాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతం చక్కగా అందించారు. కథలో భాగంగానే పాటలు వస్తాయి తప్ప తెచ్చిపెట్టినట్లు ఎక్కడా అనిపించదు. హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్‌ రవితేజ గిరిజాల తన కత్తరకు చాలా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.5/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top