Pushpa Review : ‘పుష్ప’ మూవీ ఎలా ఉందంటే.. ?

Pushpa Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : పుష్ప - ది రైజ్‌
నటీనటులు : అల్లు అర్జున్ , రష్మికా మందన్న,  ఫహాద్‌ ఫాజిల్, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ, ధనుంజయ్, అజయ్‌ ఘోష్, బాబీ సింహా తదితరులు
నిర్మాణ సంస్థ : మైత్రీ మూవీ మేకర్స్‌
నిర్మాత : నవీన్ యెర్నేని, వై. రవి శంకర్
దర్శకత్వం : సుకుమార్‌
సంగీతం : దేవీశ్రీప్రసాద్‌
సినిమాటోగ్రఫీ : మీరోస్లా కూబా బ్రోజెక్
విడుదల తేది : డిసెంబర్‌ 17,2021

టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఫలానా స్టార్‌ హీరో, డైరెక్టర్‌ కలిసి ఓ సినిమా చేస్తే చూడాలని సినీ ప్రియులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తమ అభిమాన హీరో.. ఫలానా డైరెక్టర్‌తో సినిమా చేస్తే హిట్‌ ఖాయమని అభిమానుల ధీమాతో ఉంటారు. అలాంటి కాంబోలలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌లది ఒకటి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘ఆర్య, ఆర్య2’చిత్రాలు సూపర్‌ హిట్‌ అవడమే అందుకు కారణం. ఈ ఇద్దరు స్టార్స్‌లు 12 ఏళ్ల తర్వాత కలిసి చేసిన సినిమానే ‘పుష్ప’.రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలోని మొదటి పార్ట్‌ ‘పుష్ప - ది రైజ్‌’ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన  ట్రైలర్‌, పాటలకు పాజిటివ్‌ రెస్పాన్స్‌  రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది.‘అల వైకుంఠపురములో’లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత బన్నీ... ‘రంగస్థలం’లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత సుకుమార్‌ నుంచి వస్తున్న ‘పుష్ప’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘తగ్గేదే లే’అంటూ జానాల్లోకి దూసుకొచ్చిన ‘పుష్ప’మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

‘పుష్ప’కథేంటంటే..?
పుష్ప అలియాస్‌ పుష్పరాజ్‌(అల్లు అర్జున్‌) ఒక కూలీ. చెప్పుకోవడానికి ఇంటి పేరు కూడా లేకపోవడంతో చిన్నప్పుడే చదువు స్వస్తి చెప్పి ఊరమాస్‌గా పెరుగుతాడు. రాయలసీమలోని శేషాచలం కొండల్లో ఎర్ర చందనం మొక్కలను కొట్టే కూలీగా  జీవితాన్ని ప్రారంభించిన పుష్ప అతి తక్కువ సమయంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కీలకమైన వ్యక్తిగా ఉండే కొండారెడ్డి(అజయ్‌ ఘోష్‌)కు దగ్గరవుతాడు. సరుకును రోడ్డు దాటించడానికి మంచి ఉపాయాలు చెబుతూ.. ఎర్రచందనం స్మగ్లర్‌ల సిండికేట్‌లో భాగస్వామి అవుతాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ  అప్పటికే సిండికేట్‌కు లీడర్‌గా ఉన్న మంగళ శ్రీను(సునీల్‌)కు పక్కలో బల్లెంలా తయారవుతాడు. ఈ క్రమంలో కొండారెడ్డి బ్రదర్స్‌తో పాటు మంగళం శ్రీనుతో శత్రుత్వం పెరుగుతుంది. మరి వారిని పుష్ప ఎలా ఎదుర్కొన్నాడు? ఎర్రచందనం సిండికేట్ లీడర్‌గా పుష్ప కు ఎదురైన సవాళ్లు ఏంటి? చిన్నప్పుడే ఇంటి పేరు కోల్పోయిన తనను.. ఆ కారణంగా అవమానించే వారికి ఎలా బుద్ధి చెప్పాడు? పాలు అమ్ముకునే అమ్మాయి శ్రీవల్లితో ప్రేమలో పడిన పుష్ప.. ఆమెను పెళ్లి చేసుకున్నాడా లేదా? ఎర్రచందనం స్మగ్లింగ్‌ సిండికేట్‌ లీడర్‌గా ఉన్న పుష్పకు.. కొత్తగా వచ్చిన ఎస్పీ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌(ఫహాద్‌ ఫాజిల్‌)తో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేదే ‘పుష్ప.. దిరైజ్‌’కథ. 

ఎవరెలా చేశారంటే.. 
‘పుష్ప’సినిమా అల్లు అర్జున్‌ వన్‌మ్యాన్‌ షో అని చెప్పాలి. సినిమా మొదలైన మరు క్షణం నుంచి ప్రేక్షకులకు పుష్ప రాజ్ తప్ప అల్లు అర్జున్ కనిపించడు. మాస్‌లుక్‌లో బన్నీ అదరగొట్టేశాడు. చిత్తూరు యాసలో ఆయన పలికే డైలాగ్స్‌ అదుర్స్‌. యాక్షన్ సన్నివేశాలలోనూ బన్నీ విశ్వరూపం చూపించాడు. ప్రతి సన్నీవేశంలోనూ ‘తగ్గేదేలే’అన్నట్లు అల్లు అర్జున్‌ నటన ఉంది. ఇక పాలు అమ్ముకునే మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీవల్లీ పాత్రలో రష్మిక ఒదిగిపోయింది. తొలిసారి డీగ్లామర్‌ పాత్రలో చేసిన ఈ భామ... శ్రీవల్లీ పాత్రకు న్యాయం చేసింది. మంగళం శ్రీనుగా సునీల్‌ అద్భుత నటనను కనబరిచాడు. ఎర్రచందనం స్మగ్లర్స్ సిండికేట్ నాయకుడిగా సునీల్ సూపర్ గా యాక్ట్ చేశాడు. తెరపై కొత్త సునీల్‌ కనిపిస్తాడు. కొండారెడ్డిగా అజయ్‌ ఘోష్‌, ఎంపీగా రావు రమేశ్‌ తమ అనుభవాన్ని మరోసారి తెరపై చూపించారు. పుష్ఫకు అనుక్షణం అడ్డుపడే డీఎస్పీ గోవిందప్పగా శత్రు బాగా నటించాడు. అతని మేకోవర్ ఆకట్టుకునేలా ఉంది. ఎర్రచందనం స్మగ్లర్ కొండారెడ్డి తమ్ముడు జాలిరెడ్డిగా కన్నడ నటుడు ధనుంజయ్ చక్కగా నటించారు. ఇక ఎస్పీ భన్వర్‌ సింగ్‌ షేకావత్‌ పాత్రలో ఫహద్‌ ఫాజిల్‌ నటించాడు. అతని పాత్ర ద్వితీయార్ధంలోనే వస్తుంది. ఇందులో అతని పాత్ర అంతంత మాత్రంగానే ఉన్నప్పటికే.. పార్ట్‌ 2లో పుష్ప రాజ్‌తో ఢీకొట్టే బలమైన వ్యక్తి ఇతనేనని హింట్‌ ఇచ్చారు. స్పెషల్‌ సాంగ్‌లో సమంత బాగా డాన్స్‌ చేసింది. వీరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఎలా ఉందంటే..?
ఇప్పటి వరకు వెండితెరపై స్మగ్లింగ్‌ నేఫథ్యంలో​ చాలా సినిమాలు వచ్చాయి. కానీ ‘పుష్ప’కోసం దర్శకుడు సుకుమార్‌ ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యాన్ని ఎంచుకోవడం, దాని కోసం అల్లు అర్జున్‌ని పక్కా ఊరమాస్‌ లుక్‌లో మార్చడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను అందుకోవడంతో దర్శకుడు సుకుమార్‌ కొంతవరకు సఫలం అయ్యాడు. ఈ యాక్షన్‌ డ్రామాలో మదర్‌ సెంటిమెంట్‌తో లవ్‌ సెంటిమెంట్‌ని మిక్స్‌ చేసి కథను సాగించిన విధానం బాగుంది. శేషాచలంలో లభించే ఎర్రచందనం గొప్పదనాన్ని తెలియజేస్తూ కథ ప్రారంభమవుతుంది. కూలీగా ఉన్న పుష్ప రాజ్‌.. స్మగ్లింగ్‌ మాఫీయా లీడర్‌గా ఎదిగిన తీరును ఆసక్తిగాకరంగా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ నేపథ్యంతో వచ్చే సన్నివేశాలు.. ఇదివరకే వచ్చిన ఓ సినిమాను గుర్తు చేస్తాయి. ఫస్టాఫ్‌లో తండ్రి చనిపోయినప్పుడు.. పుష్ప రాజ్‌కు ఎదురయ్యే పరిస్థితులు ప్రేక్షకులను కాస్త ఎమోషనల్‌కు గురిచేస్తాయి. శ్రీవల్లితో ప్రేమ వ్యవహారం.. సీరియస్‌గా సాగుతున్న సినిమాకి అడ్డంగిగా అనిపిస్తాయి. ఇక ఇంటర్వెల్‌ ముందు వచ్చే సీన్స్‌ హైలెట్‌గా నిలుస్తాయి.

ఎర్రచందనం సిండికేట్‌ లీడర్‌గా ఎదిగిన పుష్పరాజ్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనే ఆసక్తికర అంశంతో సెకండాఫ్‌ మొదలవుతుంది. కానీ కథ సాదాసీదాగా సాగడం.. సినిమాకు కాస్త మైనస్‌. సిరియస్‌ మూడ్‌లో సాగుతున్న ఈ కథకి శ్రీవల్లి ప్రేమాయణం బ్రేకుల్లా అనిపిస్తాయి. ఇక చివరిలో  ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌గా ఫహద్‌ ఫాజిల్‌ పాత్ర పరిచయంతో కథపై ఆస్తక్తి పెరుగుతుందేమోనని ఆశించిన ప్రేక్షకులకు.. అక్కడ కూడా నిరాశే ఎదురవుతుంది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్‌ సాదాసీదాగా సాగుతాయి. ‘ఒకటి తక్కువుంది…’ అంటూ ఫహద్‌ ఫాజిల్‌ చేసే ఓవరాయాక్షన్‌ తట్టుకోవడం కాస్త కష్టమే. అయితే పార్ట్‌ 2లో అతని పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండేలా కనిపిస్తుంది. క్లైమాక్స్‌  కూడా సింపుల్‌గానే ఉంటుంది. మూడు గంటల రన్ టైమ్ కాస్త ఇబ్బంది కలిగించే విషయమే.  ఈ సినిమాకు రెండో భాగం ఉంది కాబట్టి.. ఫస్టాఫ్‌ని ఇంకాస్త తగ్గిస్తే బాగుండేదేమో. ఇక సాంకేతిక విషయాకొస్తే.. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం బాగుంది. అన్ని పాటలు చాలా బాగున్నాయి. నేపథ్య సంగీతం ఓకే. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ని అభినందిచాల్సిందే. అడవి వాతావరణం చూపించడానికి చాలా కష్టపడ్డారు. వారి కష్టమంతా తెరపై కనిపించింది.  మిరోస్లా క్యూబా సినిమాటోగ్రఫీ మూవీని మరో లెవెల్ కు తీసుకెళ్ళింది. ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చూపించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

 
 

Rating:  
(3/5)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top