ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న 43వ సినిమా ‘వేదవ్యాస్’. ఈ చిత్రం ద్వారా పిడుగు విశ్వనాథ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నారు. బుధవారం (జనవరి 14న) కె. అచ్చిరెడ్డి పుట్టినరోజుని పురస్కరించుకుని జరిపిన వేడుకల్లో హీరో పిడుగు విశ్వనాథ్‌ని పరిచయం చేశారు. కె. అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్‌పై కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హైదరాబాద్‌లో జరిగిన పిడుగు విశ్వనాథ్ పరిచయ కార్యక్రమానికి నటుడు సాయికుమార్ అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిగార్ల సినిమాలకు డబ్బింగ్ చెప్పాను కానీ నటించడం కుదరలేదు. ‘వేదవ్యాస్’లో నటుడిగా అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో వేద నారాయణ అనే మంచి క్యారెక్టర్ చేస్తున్నాను’’ అని తెలిపారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘విశ్వనాథ్‌ను హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పదనం చాటేలా రూపొందుతోన్న సినిమా ఇది’’ అని చెప్పారు. కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ– ‘‘దాదాపు ఐదారేళ్లుగా ఈ మూవీ స్క్రిప్ట్‌పై పని చేస్తున్నారు కృష్ణారెడ్డి. కొత్త హీరో అయితేనే బాగుంటుందని విశ్వనాథ్‌ని తీసుకున్నారు. ఈ మూవీలోని నటీనటులను చూశాక కృష్ణారెడ్డి జడ్జిమెంట్ ఎంత కరెక్ట్ అనేది అర్థమైంది’’ అని పేర్కొన్నారు. ‘‘అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిగార్ల సినిమాతో హీరోగా పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని పిడుగు విశ్వనాథ్ అన్నారు. ఈ చిత్రం ద్వారా సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ టాలీవుడ్‌కి పరిచయం అవు తున్నారు.


