
ఆమని, రోజా, ఎస్వీ కృష్ణారెడ్డి, ఇంద్రజ, లయ
‘‘నా సినిమాల ద్వారా ఎందరో ప్రతిభావంతులకు అవకాశాలు ఇచ్చానని చెబుతున్నారు. కానీ వాళ్లందరూ స్వతహాగా ప్రతిభ ఉన్నవారు. నా చిత్రాల ద్వారా వారి ప్రతిభ ప్రేక్షకులకు మరింతగా తెలిసింది. అంతేకానీ నేను వారికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదు’’ అని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం (జూన్ 1) హైదరాబాద్‌లో ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘నన్ను మొదటి నుంచీ ప్రోత్సహిస్తూ, అండగా నిలబడిన నిర్మాత అచ్చిరెడ్డిగారికి కృతజ్ఞతలు.
దర్శకుడిగా నాకు తొలి చాన్స్ ఇచ్చిన హీరో రాజేంద్రప్రసాద్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. నటి, మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ– ‘‘కృష్ణారెడ్డిగారి దర్శకత్వంలో చేసిన ‘శుభలగ్నం’ చిత్రం నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భర్తను కోటి రూపాయలకు అమ్మే అలాంటి ఘటనలు ఈ రోజు సమాజంలో జరుగుతున్నాయి. అంటే ఆయన సృజనాత్మకతలో ఎంత ముందు చూపు ఉందో ఊహించుకోవచ్చు’’ అని తెలిపారు. ఈ వేడుకల్లో మురళీమోహన్, బ్రహ్మానందం, శ్రీకాంత్, తనికెళ్ల భరణి, రాజేంద్రప్రసాద్, అలీ, బండ్ల గణేశ్, లయ, ఇంద్రజ, ఆమని, సుచిత్రాచంద్రబోస్ తదితరులు పాల్గొని, ఎస్వీ కృష్ణారెడ్డితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.