
జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మాతగా మారారు. సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డితో ‘వేదవ్యాస్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ వీవీ వినాయక్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంతో సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరోయిన్ జున్ హ్యున్ జీని ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు" హలో ... కంగ్రాట్యులేషన్స్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్" అంటూ బొకే అందించగా ఆమె "థాంక్యూ సర్ " అనటాన్ని ముహూర్తపు షాటుగా చిత్రీకరించారు.
ఈ సందర్భంగా దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ - నా లైఫ్ లో ఎన్ని సినిమాలైతే చేయగలనో అన్ని సినిమాలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో చేస్తాను. తొలిసారి తెలుగు మూవీలో ఒక కొరియన్ హీరోయిన్ ను పరిచయం చేస్తున్నాం. జున్ హ్యున్ జీ మా మూవీలో నటించడం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచినా, మా టీమ్ అందరికీ మాత్రం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. మీ అందరి ప్రేమాభిమానాలు, ఆదరణ, అభినందనలు పుణికిపుచ్చుకున్న నేను ఎదిగి ఈ రోజు 43వ చిత్రం "వేదవ్యాస్" తో మీ ముందుకు రాబోతున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అన్నారు.

నిర్మాత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ - ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన మీద అభిమానంతో మనం సినిమా చేద్దామని ప్రతిపాదించాను. అలా అనుకున్న ప్రాజెక్ట్ ఈ రోజు "వేదవ్యాస్"గా తయారైంది. కృష్ణారెడ్డి సినిమాలు కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటాయి, మంచి వినోదంతో పాటు సందేశం కూడా ఉంటుంది. అలాంటి చిత్రాలు నేటి సమాజానికి అవసరమని భావించి ఆయనతో మూవీ నిర్మిస్తున్నాను. రాజకీయ నాయకుడిగా, ఇంజినీరింగ్ కాలేజ్ లు నిర్వహిస్తున్న విద్యావేత్తగా, రియల్ ఎస్టేట్ లో వ్యాపారంలోనూ కొనసాగుతున్నాను. కృష్ణారెడ్డి గారి మీద అభిమానంతోనే నిర్మాతను అయ్యాను. ఆయనతో మరిన్ని చిత్రాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.
దర్శకులు వీవీ వినాయక్ మాట్లాడుతూ - నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసినప్పటి నుంచి ఇప్పిటిదాకా ఎస్వీ కృష్ణారెడ్డి అలాగే ఉన్నారు, అంతే ఎనర్జీతో వర్క్ చేస్తున్నారు. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి గార్ల కాంబినేషన్ లో "వేదవ్యాస్" సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. ప్రొడ్యూసర్ ప్రతాప్ రెడ్డి కి మొదటి సినిమా అయినా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నారు.