ఆ ఫాలోయింగ్‌ బిగ్‌బాస్‌–4 హౌస్‌లో కూర్చోబెట్టింది

Personal Life Of Bigg Boss-4 Contestant Mehaboob Dil se - Sakshi

డ్యాన్స్‌పై ఉన్న ప్యాషన్‌.. టీవీలో చూసి స్టెప్పులు నేర్పింది. యాక్టర్‌ అవ్వాలనే ఆకాంక్ష.. తొలిసారి కాలేజీ స్టేజీపైకి ఎక్కించింది. స్క్రీన్‌పై కనిపించాలనే కోరిక.. జిమ్‌లో కండలు పెంచింది. ఒకటేమిటి.. ఆసక్తి.. లక్ష్యం.. ప్రతిభ.. ఊహించని అవకాశాన్ని ఇచ్చింది. యూట్యూబ్, టిక్‌టాక్‌ స్టార్‌గా సంపాదించుకున్న ఫాలోయింగ్‌ బిగ్‌బాస్‌–4 హౌస్‌లో కూర్చోబెట్టింది. అతనే గుంటూరులో గుమ్మడికాయలు అమ్మి కుటుంబాన్ని పోషించే ఓ చిరు వ్యాపారి కుమారుడు, అభిమానుల ‘మెహబూబ్‌ దిల్‌సే’.  

గుంటూరు ఈస్ట్‌ గుంటూరులోని పొన్నూరు రోడ్డు హుస్సేన్‌ నగర్‌ 1వ లైనులో షేక్‌ మెహబూబ్‌ కుటుంబం నివాసం. తల్లిదండ్రులు షేక్‌ రఫీ, సాబీ. సోదరుడు సుభాన్‌. తండ్రి రఫీ పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్‌లో గుమ్మడికాయలు విక్రయించి జీవనాన్ని సాగిస్తున్నారు. మెహబూబ్‌ నల్లచెరువులోని మహావీర్‌ విద్యాలయంలో 10వ తరగతి వరకు, గౌతమ్‌ కళాశాలలో ఇంటర్, కిట్స్‌ కళాశాలలో 2015లో బీటెక్‌ పూర్తి చేశాడు.     

చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌పై ఆసక్తితో తోటి మిత్రులతో కలిసి టీవీల్లో వచ్చే డ్యాన్సులు చూస్తూ ప్రాక్టీస్‌ చేసేవాడు. ఇలా.. ఎవరి ప్రోత్సాహం లేకుండానే పాఠశాల, కళాశాల వేదికలపై స్టెప్పులేసి మిత్రుల్లో మంచి గుర్తింపు పొందాడు. కొన్నాళ్ల పాటు నల్లచెరువు భారత్‌ జిమ్‌లో వ్యాయామం చేసి శరీర సౌష్టవం సాధించాడు. ఒకసారి గుంటూరులో నిర్వహించిన 7అప్‌ కూల్‌ డ్రింక్‌ డ్యాన్సు అడిషన్స్‌లో తన ప్రతిభతో ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లో కూడా పోటీలను దాటుకుని చెన్నైలో నిర్వహించిన ఫైనల్స్‌లో గట్టి పోటీ ఇచ్చి రెండవ స్థానంలో నిలిచాడు.  (మాట‌లు జాగ్ర‌త్త‌గా రానీ: మెహ‌బూబ్ వార్నింగ్‌)

తల్లితండ్రి సోదరుడితో మెహబూబ్‌
అనంతరం కుటుంబ ఆర్థిక పరిస్థితి మెహబూబ్‌ను ఉద్యోగం వైపు నడిపించగా హైదరాబాదులో 2016లో సాఫ్ట్‌వేర్‌ కొలువులో చేరాడు. అయితే కళా తృష్ణను విడిచిపెట్టకుండా ఖాళీ సమయంలో వెబ్‌ సిరీస్, కవర్‌ సాంగ్స్, మోటివేషనల్‌ వీడియోస్, టిక్‌టాక్‌ కంటెంట్‌ వీడియోస్, సార్ట్‌ ఫిల్మŠస్‌ చేసి యూట్యూబ్‌లో తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే అతని ప్రతిభను గుర్తించిన సోషల్‌ మీడియాలో పలు ఆసక్తికర విషయాలను ప్రసారం చేసే సంస్థ అవకాశాన్ని, జీతాన్ని ఇచ్చింది.

తనకు ఇష్టమైన రంగంలో పని దొరకడం మెహబూబ్‌కు వరంలా మారింది. ఈ క్రమంలోనే అనేక మంది సినిమా హీరోలు, సినీ పెద్దల అభినందనలు అందుకున్నాడు. ఇంతలో  సోషల్‌ మీడియాలో పాపులరై ఎక్కువ మందిని ఎంటర్‌టైన్‌ చేసినందుకు బిగ్‌బాస్‌ నిర్వాహకులు మెహబూబ్‌ను సీజన్‌–4 హౌస్‌కు ఆహా్వనించారు. మెహబూబ్‌ తప్పక విజయం సాధించాలని మిత్రులు, గుంటూరు వాసులు ఆకాంక్షిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top