ఆడిషన్‌కు వెళ్తే ఆర్జీవీ బెంచ్‌ మీద కూర్చోబెట్టి..: పంకజ్‌ | Sakshi
Sakshi News home page

Pankaj Tripathi: వర్మ ఆడిషన్‌కు వెళ్లా.. నన్ను వెళ్లిపోమని చెప్పాడు.. తర్వాత పిలవనేలేదు

Published Mon, Jan 8 2024 11:12 AM

Pankaj Tripathi: After Audition Ram Gopal Varma Asked Me to Leave and Never Called Me Back - Sakshi

కొన్నిసార్లు నిరాశ, ఓటములు కూడా మంచే చేస్తాయంటున్నాడు బాలీవుడ్‌ నటుడు పంకజ్‌ త్రిపాఠి. ఓసారి రామ్‌గోపాల్‌ వర్మ సినిమా ఆడిషన్‌కు వెళ్తే తనను సెలక్ట్‌ చేయలేదని, కానీ తర్వాత మాత్రం వేరే చోట్ల ఆఫర్స్‌ రావడంతో కెరీర్‌లో ముందుకు వెళ్లానని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంకజ్‌ త్రిపాఠి మాట్లాడుతూ.. 'ముంబైలో అడుగుపెట్టిన తొలినాళ్లలో అవకాశాల కోసం తిరిగాను. అలా ఓసారి రామ్‌గోపాల్‌ వర్మ ఆఫీసుకు వెళ్లాను. అక్కడికి వెళ్లేసరికే చాలామంది ఉన్నారు. వాళ్లంతా గూండాల్లా కనిపించారు. నా ముఖమేమో చూడటానికి కాస్త అమాయకంగా కనిపిస్తుంది.

అందరూ భయంకరంగా..
మరి గూండా పాత్రకు నేను సూటవుతానా? లేదా? అన్న అనుమానంతోనే లోపలకు వెళ్లాను. కొందరికైతే ముక్కు, ముఖం మీద దెబ్బ తాకినట్లుగా గాయాలు కనిపించాయి. మీరు నటులేనా? అని అడిగితే అవునన్నారు. మరి ఎందుకింత భయంకరంగా రెడీ అయి వచ్చారని ప్రశ్నిస్తే.. ఆర్జీవీ ఖతర్నాక్‌గా కనిపించేవాళ్లనే సెలక్ట్‌ చేసుకుంటాడని చెప్పారు. తర్వాత వర్మ నన్ను పిలిచి బెంచీ మీద కూర్చోమన్నాడు. నా ఎదురుగా కూర్చుని 10-15 నిమిషాలపాటు నా కళ్లలోకి కళ్లు పెట్టి చూశాడు. ఎవరైనా మనల్ని అదేపనిగా చూస్తే ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది.

అంతా మన మంచికే!
కాసేపటికే అతడు నన్ను వెళ్లిపోమని చెప్పాడు. తర్వాత మళ్లీ ఎప్పుడూ పిలవలేదు. కానీ అతడు అద్భుతమైన దర్శకుడు. మేము కలుసుకున్న ప్రతిసారి నా పనిని, నన్ను పొగుడుతూ ఉంటాడు. కాకపోతే ఆ సమయానికి మాకు సెట్‌ అవ్వలేదంతే! ఒకవేళ ఆరోజు ఆయన నన్ను సెలక్ట్‌ చేసి ఉంటే తను, నేను ఈ క్రేజ్‌ కోల్పోయేవాళ్లమేమో! ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. దేనికీ బాధపడకూడదు. ఏదో మంచి జరగబోతుందన్న ఆశతో బతికేయాలి' అని చెప్పుకొచ్చాడు.

నాటకాల నుంచి సినిమాలకు..
కాగా పంకజ్‌ త్రిపాఠి.. స్కూల్‌లో నాటకాలు వేసేవాడు. అది కూడా అమ్మాయిల వేషాలు ఎక్కువగా వేసేవాడు. ఐటం సాంగ్స్‌కు డ్యాన్స్‌ చేసేవాడు. సరాదా కోసం వేసిన నటనే తర్వాత ఆయనకు జీవితంగా మారిపోయింది. బరేలీ కీ బర్ఫీ, న్యూటన్‌, స్త్రీ, గుంజన్‌ సక్సేనా వంటి పలు సినిమాల్లో నటించిన ఆయన మంచు విష్ణు 'దూసుకెళ్తా' మూవీలో విలన్‌గా నటించి తెలుగువారికీ దగ్గరయ్యాడు. గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్‌, మీర్జాపూర్‌, క్రిమినల్‌ జస్టిస్‌ వంటి వెబ్‌ సిరీస్‌లతో మరింత క్రేజ్‌ తెచ్చుకుని బిజీ స్టార్‌ అయ్యాడు. ప్రస్తుతం అతడు 'మై అటల్‌ హూన్‌' సినిమా చేస్తున్నాడు. దివంగత ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ జనవరి 19న విడుదల కానుంది.

చదవండి: ముంబైలో మంచు లక్ష్మి ఇల్లు ఎలా ఉందో చూశారా.. వీడియో వైరల్‌

Advertisement
 
Advertisement