ప్రపంచ వేదికపై ఓరుగల్లు

Oscar winner lyricist Chandrabose  - Sakshi

హన్మకొండ కల్చరల్‌/సాక్షి నెట్‌వర్క్‌: కళలు, కళాకారులు, కవులు, రచయితలకు పుట్టినిల్లు ఓరుగల్లు. అలాంటి నేపథ్యమున్న ప్రాంతంనుంచి విశ్వవేదిక వరకు ఎదిగిన చంద్రబోస్‌ ఉమ్మడి జిల్లా కలికితురాయిగా నిలిచారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్‌ పాటల విభాగంలో పాట రచయిత, ఉమ్మడి జిల్లాకు చెందిన చంద్రబోస్‌ ఆస్కార్‌ అవార్డు గెలుచుకోవడంపై పలువురు కవులు, కళాకారులు, రచయితలు, సినీగేయ రచయితలు హర్షం వ్యక్తం చేశారు. వారు కవిత ద్వారా, గీతికల ద్వారా చంద్రబోస్‌ను అభినందించారు. శారద నాట్యమండలి సభ్యులు జేఎన్‌ శర్మ, జూలూరు నాగరాజు, జేబీ కల్చరల్‌ సొసైటీ నిర్వాహకులు జడల శివ తదితరులు చంద్రబోస్‌కు అభినందనలు తెలిపారు. ఉమ్మడి జిల్లా కవులు, కళాకారులు, సినీ దర్శకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 

బంగారు గురిగిని తీసుకొచ్చే స్థాయికి.. 
తెలుగు పాటకు ఆస్కార్‌ రావడం మన జాతికి లభించిన గౌరవం. చంద్రబోస్‌ అన్నను స్ఫూర్తిగా తీసుకొని సినిమా రంగంలోకి వచ్చా. తెలుగు వర్ణమాల ఈనాడు మీ మెడలో విజయ వర్ణమాలగా మారింది. చల్లగరిగ నుంచి బంగారు గురిగిని(భారతదేశానికి మొదటిసారిగా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు లభించడం), ఇప్పుడు ఆస్కార్‌ అవార్డు తీసుకొచ్చే స్థాయికి ఎదిగిన చంద్రబోస్‌కు అభినందనలు. 
– కాసర్ల శ్యామ్, ప్రముఖ జానపద, సినీ గేయ రచయిత

తెలంగాణ తల్లికి వజ్రకిరీటం
చంద్రబోస్‌కు ఆస్కార్‌ అవార్డు రావడం తెలుగు జాతికి వచ్చినంత గర్వకారణం. తెలంగాణ తల్లికి వజ్రకిరీటం.. పల్లె పల్లె పచ్చికలో పూలు పూసిన సంతోషం.. తెలంగాణ పల్లెలోని పచ్చిక పూల తీవాచీ పరుస్తుంది.. పుట్ల కొద్దీ వృక్షజాతి నవధాన్యాల సిరిసంపదలు .. ఇవన్నీ విరివిగా పండి పల్లె ఆసాముల ఇండ్లలో రాశులుగా పోసిన సంతోషం. జాతి గర్వపడే విషయం. తేట జలపాతపు ఊటలు వెనుకటి లాగా ఉప్పొంగి అలుగులు వారిన సంతోషం. జానపద కళలన్నీ కూడా ఈ సందర్భంగా ఆయనకు స్వాగత విజయభేరి మోగిస్తున్నాయి. 
– వరంగల్‌ శ్రీనివాస్, సినీ సంగీత దర్శకుడు 

తెలుగు వారంతా గర్వపడే విషయం
భారతదేశ చరిత్రలో నాకు తెలిసి గేయ రచయితకు ఆస్కార్‌ రావడం ఇదే ప్రథమం. అప్పట్లో ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాటకు జాతీయ పురస్కారాన్ని అందించేందుకు భారత ప్రభుత్వం వేటూరి సుందరరామమూర్తిని ఆహ్వానించింది. ‘నా తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తిస్తేనే ఈ అవార్డు తీసుకుంటా’ అని ఆయన పురస్కారాన్ని తిరస్కరించారు. అలాంటిది ఈ దేశం గుర్తించని భాషలో(తెలంగాణ మాండలికంలో) పాట రాసిన చంద్రబోస్‌ ఇప్పుడు ప్రపంచం నోట తెలుగు పాటను పాడిస్తున్నారు. ఈ అవార్డు రావడం తెలుగు వారంతా గర్వించదగ్గ విషయం. 
– మిట్టపల్లి సురేందర్, సినీ గేయ రచయిత

సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు...
సినీ కళా సామ్రాజ్యంలో చిరకాల కలగా మిగిలిపోయిన ఆస్కార్‌ సాకారమైన ఆ సమయం. భారతీయ చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్ష
రాలతో లిఖించదగింది. తెలంగాణ తెలుగు పాటల రచయిత చంద్రబోస్‌ కలం నుంచి జాలువారిన  ఆణిముత్యం నాటు నాటు పాట. తెలంగాణ భాష, యాసకు విశ్వవేదికపై స్థానం కల్పించి విజయజెండా ఎగరేసి వీనుల విందుగా విహరింపజేసిన చంద్రబోస్‌ ఎందరికో ఆదర్శప్రాయుడు.
గొట్టె రమేశ్‌ , పాటల రచయిత

చంద్రబోస్‌తో రెండు పాటలు రాశా.. 
తెలుగు సినిమాని ఖండాంతరాలు దాటించి ఒక తెలుగువాడి సత్తా చాటి భారతదేశ గొప్పదనాన్ని, తెలుగు అనే భాష తెలియని ఇతర దేశాలకు తెలుగు వెలుగులు నింపిన గీత రచయిత చంద్రబోస్‌ నా ప్రాంతంవాడని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. చంద్రబోస్‌తో కలిసి అనువంశికత సినిమాలో రెండు పాటలు రాశాను. చాలా ఆనందంగా ఉంది. 
– రామకృష్ణ కందకట్ల, గీత రచయిత, సంగీత దర్శకులు (వరంగల్‌)

మా ప్రాంతవాసి కావడం సంతోషకరం 
ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ అవార్డు రావడం హర్షణీయం. పాటను రాసిన ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌ మా ప్రాంతవాసి కావడం సంతోషంగా ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచి్చన చంద్రబోస్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. 
– గండ్ర వెంకటరమణారెడ్డి,భూపాలపల్లి ఎమ్మెల్యే

చల్లగరిగలో సంబురాలు
చిట్యాల: చంద్రబోస్‌ రచించిన ట్రిపుల్‌ ఆర్‌ సినిమాలోని ‘నాటు..నాటు’ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌ అవార్డు దక్కించుకున్న సందర్భంగా చిట్యాల మండల కేంద్రంలో గ్రామీణ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఆయన స్వగ్రామం చల్లగరిగలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఆయా కార్యక్రమాల్లో దావు వీరారెడ్డి, అప్పాల వెంకటరమణ, మేరుగు సమ్మయ్య, జాలీగపు రవీందర్, బండి సత్యం, కళాకారులు చింతల రమేశ్, దాసారపు నరేశ్, మ్యాదరి సునీల్, రాజు నాయక్, జన్నే యుగేందర్, రజినీకాంత్, పుల్ల ప్రతాప్, రత్నాకర్‌ పాల్గొన్నారు.

గర్వంగా ఉంది..
ప్రాంతీయ సినిమా విశ్వ వేదికపై నిలబడడం చాలా గొప్ప విషయం. పల్లె పలుకులతో ప్రాణం పోసుకున్న పాట ప్రపంచాన్ని మెప్పించింది. ఇప్పుడు ఏ నోట చూసినా నాటు నాటు పాటే. తెలుగు సినిమా ఎందులోనూ తీసిపోదు అని మరోసారి నిరూపితమైంది. చంద్రబోస్, కీరవాణి, ఇతర టీమ్‌కు అభినందనలు.
– ఉదయ్‌ గుర్రాల, సినీ డైరెక్టర్‌

హాలీవుడ్‌కు పునాది
‘నాటు నాటు’ పాటలో మట్టివాసన ఉంది. పల్లె ప్రతీకలతో సాహిత్యాన్ని చంద్రబోస్‌ గొప్పగా రాశారు. చంద్రబోస్‌ వరంగల్‌ వాసి కావడం మనందరికీ గర్వకారణం. ఆస్కార్‌ అవార్డు రావడంతో హాలీవుడ్‌కు పునాది వేసినట్లయ్యింది. ఇకపై ప్రపంచమంతా మన సినిమాలు చూడనుంది. ఆస్కార్‌ అవార్డు రావడం ఎంతో సంతోషకరమైన విషయం.
– డాక్టర్‌ ప్రభాకర్‌ జైనీ, సినీ దర్శకుడు
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top