
నితిన్ నటించిన 'తమ్ముడు' సినిమా జూలై 4న విడుదలైంది. దర్శకుడు వేణు శ్రీరాం ఈ మూవీని తెరకెక్కించారు. అయితే, ప్రేక్షకులను ఏమాత్రం ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. దీంతో మొదటిరోజు చాలా తక్కువ కలెక్షన్స్ సాధించినట్లు సాక్‌నిక్ వెబ్‌సైట్ ప్రకటించింది. నితిన్ కెరీర్‌లోనే అత్యంత తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్న మూవీగా తమ్ముడు అని పేర్కొంది. ఆయన నటించిన గత సినిమా 'రాబిన్ హుడ్' ఫస్ట్ డే నాడు రూ. 4.8 కోట్ల గ్రాస్ సాధించిగా తమ్ముడు కలెక్షన్స్ ఆ మార్క్‌ను కూడా చేరుకోలేకపోయింది.
భీష్మ, రంగ్ దే సినిమాల తర్వాత సరైన విజయం లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌పై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆపై దర్శకుడు వేణు శ్రీరాం కూడా ఎం.సి.ఏ, వకీల్ సాబ్ సినిమాల తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజుతో మూడో సినిమాగా 'తమ్ముడు' ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేయడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. కానీ, తమ్ముడు చిత్రం వారిని తీవ్రంగానే నిరాశపరిచింది. దీంతో మొదటిరోజు కేవలం రూ. 4 కోట్ల గ్రాస్ మాత్రమే బాక్సాఫీస్ వద్ద సాధించినట్లు పలు వెబ్‌సైట్లు ప్రకటించాయి. అయితే, కలెక్షన్ల వివరాలు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. నితిన్ కెరీర్‌లోనే అత్యంత తక్కువ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా తమ్ముడు నిలిచిందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
దిల్ రాజు నిర్మించిన 'తమ్ముడు' సినిమా నితిన్ కెరీర్‌ను తిరిగి ప్రారంభిస్తుందని అందరూ భావించారు. కానీ, అది వారిద్దరికీ మరో పరాజయంగా మారింది. వరుస పరాజయాలతో బాక్సాఫీస్ వద్ద నితిన్ పోరాటం కొనసాగుతోంది. ఇది అభిమానులను మాత్రమే కాకుండా చిత్ర పరిశ్రమ మార్కెట్‌ను కూడా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో గేమ్ ఛేంజర్ వల్ల భారీగా నష్టపోయిన దిల్ రాజు ఇప్పుడు మరోసారి భారీగా నష్టపోవడం తప్పదని తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఆయన రూ. 50 కోట్లకు పైగానే ఖర్చు చేశారని టాక్. అయితే, తమ్ముడు సినిమా కేవలం రూ. 20 కోట్ల వరకు మాత్రమే మార్కెట్ చేసినట్లు సమాచారం.