
కోలీవుడ్ భామ నయనతార నటించిన వివాదాస్పద చిత్రం 'అన్నపూరణి-ది గాడెస్ ఆఫ్ ఫుడ్'. 2023లో వచ్చిన ఈ సినిమాకు నీలేశ్ కృష్ణ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీకి థియేటర్ల వద్ద మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. ఇందులో నయన్ బ్రహ్మణి అమ్మాయి పాత్రలో కనిపించింది. అదే పెద్ద వివాదానికి దారితీసింది. ఈ చిత్రంలో ఓ బ్రహ్మణ అమ్మాయిని నాన్ వెజ్ వంటలు చేసే చెఫ్‌గా చూపించడం ఆ వర్గం మనోభావాలు దెబ్బతీసింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాను తొలగించగా.. నయనతార క్షమాపణలు చెప్పింది.
తాజాగా ఈ చిత్రం మరో భాషలో అందుబాటులోకి వస్తోంది. అక్టోబర్ 1 నుంచి జియో హాట్ స్టార్‌లో హిందీ వర్షన్ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో రిలీజైన దాదాపు రెండేళ్లు పూర్తి కావొస్తోంది. ఇన్ని రోజుల తర్వాత హిందీ వర్షన్ అందుబాటులోకి తీసుకురావడం విశేషం. అన్నపూరణి సినిమాను జీ స్టూడియోస్, నాద్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్‌లపై ఆర్. రవీంద్రన్ మరియు జతిన్ సేథి నిర్మించారు. ఈ సినిమాకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం సింప్లీ సౌత్ అనే ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే ఈ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ కేవలం ఓవర్‌సీస్ ఆడియన్స్‌కు మాత్రం అందుబాటులో ఉంది.