సినీ రంగంలో భంభం బోలే! | Music Director Bole Shavali Special Story From Warangal | Sakshi
Sakshi News home page

సంగీత దర్శకుడిగా రాణిస్తున్న మానుకోట వాసి

Aug 6 2020 11:42 AM | Updated on Aug 6 2020 11:42 AM

Music Director Bole Shavali Special Story From Warangal - Sakshi

పాట పాడుతున్న బోలే షావలీ 

ఆనందం, బాధ, కోపం ఎలాంటి భావాలనైనా సంగీతం ద్వారా  పలికించవచ్చు. అటువంటి సంగీతంలో మానుకోటకు చెందిన బోలె షావలీ దూసుకెళ్తున్నాడు. ఇప్పటి వరకు 20కి పైగా సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఆయన ఇటీవల కరోనాపై  ప్రజలకు చైతన్యం కలిగించేలా రూపొందించిన పాట ప్రశంసలు అందుకుంది.

మహబూబాబాద్‌ అర్బన్‌: సంగీతం అనేది మానవుడికి భగవంతుడు ప్రసాదించిన వరం. ఆనందం, బాధ, కోపం, ప్రేమ, విరహం వంటి ఎలాంటి భావాలనైనా సంగీతం ద్వారా అందంగా పలికించవచ్చు. రాళ్లను కూడా కరిగించే శక్తి సంగీతానికి ఉంది. అటువంటి సంగీతంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు మహబూబాబాద్‌కు చెందిన బోలె షావలీ. ఇప్పటివరకు 20కి పైగా సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఆయన ఇటీవల కరోనాపై ప్రజలకు చైతన్యం కలిగించేలా రూపొందించిన పాట ప్రశంసలు అందుకుంది.

ప్రస్థానం ఇలా...
మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో యాకూబ్‌ అలీ – మెహిదీన్‌బీ దంపతులకు నాలుగో సంతానం బోలేæ షావలీ. ఆయనకు ఇద్దరు చెళ్లెళ్లు, ముగ్గురు అన్నలు ఉన్నారు. తల్లిదండ్రులు రెండు ఎకరాల భూమిలో సాగు చేస్తేనే జీవనం గడిచేది. బోలే చిన్న తనం నుంచి అమ్మకు చేదోడువాదో డుగా ఉంటూ ఆమె పాటలు పాడుతుంటే వింటూ నేర్చుకుని సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. పెనుగొండ ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తయ్యాక 7వ తరగతి నుంచి పదో తరగతి వరకు మహబూబాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్తిచేశారు. ఇంటర్, డిగ్రీ పూర్తయ్యాక మిత్రులతో కలిసి సంగీత సాధన చేసేవారు. ప్రైవేట్‌ టీచర్‌గా వృత్తి కొనసాగిస్తున్నప్పుడు భారత్‌ వికాస్‌ పరిషత్‌ ఆధ్వర్యంలో పిల్లలకు ఆయన నేర్పించిన పాట లు రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్నాయి.

తొలి అడుగులు..
మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని హన్మంతునిగడ్డలో మిత్ర బృందంతో అద్దె గదిలో ఉండే బోలె షావలీ సంగీత సాధన చేస్తుండేవారు. ఆ సమయంలో మిత్రుడు బూరుగుల లక్ష్మణ్‌తో పాటు పబ్బతి సుధాకర్, చంద శ్రీనివాస్, నందన్‌ రాజ్, ప్రభాకర్, మల్లేష్, ప్రేమ్‌కుమార్‌ ప్రోత్సహించారు. తొలి సారి శ్రీనిలయం సినిమా డైరెక్టర్‌ మధువన్‌ బోలెకు అవకాశం కల్పించారు. తొలిసారి ఒక్కడే కానీ ఇద్దరు సినిమాకు కూడా మ్యూజిక్‌ అందించారు. ఇలా సుమారు 30 సినిమాలే కాకుండా ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ రూపొందించారు. మయహో యమ, నాన్‌స్టాఫ్, బంతిపూల జానకి, రవితేజ నటించిన కిక్‌ 2(మమ్మీ.. పాట రచించి, పాడారు)తో పాటు బిత్తిరి సత్తి నటించిన తుపాకీ రాముడు సినిమాకు సంగీతం అందించి ఆకట్టుకున్నారు. ఇవేకాకుండా హిందీలో తుహీ మెహెరా పహేలా ప్యార్, స్టెపినీ 2, నానే రాజా – నానె రాణి లాంటి సినిమాలకు సంగీతం అందించిన బోలె ఆకట్టుకున్నారు. 

అవార్డులు, పాటలు
హిజ్రాల జీవన విధానంపై 2013లో రూపొందించిన థర్డ్‌ మ్యాన్‌ సినిమాకు బోలె షావలీ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఇంకా పలు టీవీ చానళ్లలో తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా పాటలు రూపొందించి ఆకట్టుకున్నారు. తాజాగా ఒగ్గు కథ రూపంలో కరోనాపై పాటను చిత్రీకరించి ప్రజలను ఆకట్టుకోగా, రాఖీ పండుగ లఘు చిత్రంలో కూడా ఆయన నటించారు. కాగా, హైదరాబాద్‌ కృష్ణానగర్‌లో స్టూడియో ఏర్పాటుచేసుకున్న బోలె షావలీ జిల్లా నుంచి ఎవరు వచ్చినా ఆదరించి అక్కున చేర్చుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement